‘గ్రేట్ ఛాంపియన్’.. మాజీ PM మన్మోహన్ సింగ్‎కు మృతికి అమెరికా సంతాపం

వాషింగ్టన్: ప్రముఖ ఆర్థికవేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. యూఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంలో మన్మోహన్ సింగ్ గ్రేట్ ఛాంపియన్ అని కొనియాడింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలలో భారత్, అమెరికా మధ్య అధునాతన సంబంధానికి పునాది వేయడంలో డాక్టర్ సింగ్ సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 

"మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించినందుకు భారతదేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది. యూఎస్--భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపర్చిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. భారత దేశ అభివృద్ధికి ఆయన గొప్ప పునాదులు వేశారు. యుఎస్-ఇండియా పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. 

ఈ ఒప్పందం భారత్ అమెరికాల మధ్య బంధాన్ని మరింత దృఢంగా చేసింది. ఆర్థిక సంస్కరణలతో భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దోహదపడిన మన్మోహన్ సింగ్‎ ఎప్పటికి గుర్తు ఉండిపోతారు. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం కృషి చేసిన మన్మోహన్ సింగ్ అంకితభావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం’ అని పేర్కొన్నారు. 

కాగా, గురువారం (డిసెంబర్ 26)  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆర్థిక వేత్త, డైనమిక్ లీడర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.