ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వీడని సందిగ్ధత

  • రాజకీయ జోక్యంతో ఆగిన పనులు 
  • ఇప్పటికే అన్ని అనుమతులు
  • కాలుష్యంతో నష్టమంటున్న రైతులు
  • అలాంటిదేమీ ఉండదంటున్న యాజమాన్యం
  • స్థానికులకు ఉపాధి అవకాశాలపై ఆశలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి శివారులో ఏర్పాటు చేయాలనుకున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై నీలి నీడలు తొలగడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ఏడాదిన్నర క్రితమే అన్ని అనుమతులు తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులతోపాటు రాష్ట్ర పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్ కూడా లభించింది. అయితే ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై అప్పట్లో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు, ఆధిపత్య ధోరణి కారణంగా ఆటంకాలు మొదలయ్యాయి. ఫలితంగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది.

ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని రైతులు ఆందోళనలు చేపట్టారు. నిర్మాణ స్థలంలో ఏర్పాటుచేసిన షెడ్లను తొలిగించేశారు. ఈ ఆందోళనల వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతుల నుంచి వ్యతిరేకత కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణంపై స్తబ్ధుగా ఉండిపోయిన యజమాన్యం.. మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని భావిస్తోంది. పరిశ్రమ ఏర్పాటుతో ఎలాంటి నష్టం ఉందబోదని రైతుకు అవగాహన కల్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఫ్యాక్టరీ ఏర్పాటుతో జరిగే ప్రయోజనాలు, అపోహలపై వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది.

పరిశ్రమతో అభివృద్ధే.. కాలుష్యముండదు..

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో రైతులకే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని యాజమాన్యం ప్రచారం మొదలుపెట్టింది. ఈ పరిశ్రమను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో నిర్వహిస్తామని, ఎలాంటి వ్యర్థ పదా ర్థాలు పరిశ్రమను ధాటి బయటకు వెళ్లవని, వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా తిరిగి ఉపయోగిస్తామని యాజమాన్యం స్పష్టం చేస్తుంది. ఇందుకు సంబంధించి కాలుష్య నియంత్రణ బోర్డు సూచనలు, అలాగే పరిశ్రమ ఏర్పాటుతో రైతులకు జరిగే ప్రయోజనాలపై కరపత్రాల ద్వారా వివరిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పరిశ్రమలో ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేసి కాలుష్యంపై సాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తుందని, తాము నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే అధికారులకు తెలిసిపోతుందంటూ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.

పరిశ్రమ నుంచి ఎలాంటి విషవాయువులు బయటకు రావని, అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక నీటి చుక్క కూడా భూమిలోకి ఇంకదని వివరిస్తోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే వరి, మొక్కజొన్న, సోయాబీన్, జొన్న లాంటి పంటలన్నిటినీ తామే కొనుగోలు చేస్తామని, దీంతో రైతులకు రవాణా భారం ఉండదని యాజమాన్యం పేర్కొంటోంది. దీంతోపాటు దాదాపు 1100 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెబుతోంది. యాజమాన్యం ప్రచారంతో పరిశ్రమ ఏర్పాటుపై స్థానికంగా మళ్లీ చర్చ మొదలైంది.

నష్టం జరుగుతుందంటున్న రైతులు

ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ ప్రాంతమంతా కలుషితమవుతుందని రైతులు మొదట్లో ఆరోపించారు. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే పొగ, మురికి నీరుతో ఈ ప్రాంతమంతా కలుషితమవుతుందని, పంటలకు నష్టం జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురికి నీటితో దుర్గంధం వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకున్నారు. అయితే పరిశ్రమ ఏర్పాటుతో ఎలాంటి నష్టం జరగదని కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోందని, ఈ అంశాలను రైతులకు పరిగణలోకి తీసుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంటోంది.