ఆదర్శప్రాయుడు అంబేద్కర్

‘రాజ్యాంగం మంచి, చెడుల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అమలు చేయడానికి మనం ఎన్నుకునేవాళ్లను బట్టి మంచి రాజ్యాంగం చెడు రాజ్యాంగంగా మారిపోవచ్చు. అదేవిధంగా అమలుచేసే వాళ్లను బట్టి చెడు రాజ్యాంగం కూడా మారిపోవచ్చు’ ఇవి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు. రేపు అంబేద్కర్​  జయంతి.  ప్రపంచ మేధావుల్లో ఒకరైన అంబేద్కర్ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం అభివృద్ధిపై ఎన్నో కలలు కన్నారు.  

దేశంలో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని అంబేద్కర్​ ఆకాక్షించారు.  ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించారు.  రాజ్యాంగ రూపకర్తగా పేరు తెచ్చుకున్నారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌‌‌‌లోని మౌలో జన్మించారు. రామ్‌‌జీ మలోజీ  సక్పాల్‌‌,  బీమాబాయి దంపతుల14వ సంతానం అంబేద్కర్. వారి కుటుంబం 1904లో  బొంబాయికి వచ్చింది.  ఇప్పటి మహారాష్ట్రలోని  రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారికి మరాఠీ నేపథ్యం ఉంది. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు.  అంబేద్కర్  చిన్నప్పుడే  ఆర్థిక కష్టాలతో  తల్లి చనిపోయింది.  అంబేద్కర్​13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు  అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు.  మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు.  

బరోడా మహారాజు ఆర్థికసాయం

బరోడా మహారాజు శాయాజీరావ్  గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో  బీఏ  పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు.  పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ, పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు.  విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేండ్లు పనిచేసే షరతుపై 1913లో  ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. 1915లో ఎంఏ, 1916లో పీహెచ్డీ పట్టాలను పొందారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేండ్ల తర్వాత ‘ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్​ఇన్ ఇండియా’ అనే పేరుతో  ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశానికి వచ్చారు. అప్పటికి ఆయన  వయస్సు 27 ఏండ్లు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం
కల్గించింది.

అంబేద్కర్​పై రాజ్యాంగ బాధ్యత

స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం రచించే బాధ్యతను తీసుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.  నిజానికి రాజ్యాంగ రచనా కమిటీలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు అప్పటి రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా అంబేద్కర్ మోయవలసి వచ్చింది. వివిధ దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి, సమగ్రమైన, సవివరణమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు.  రాజ్యాంగం మన దేశానికి దిక్సూచి. వివిధ భాషలు, మతాలు, కులాలతో నిండిన దేశంలో అందరినీ ఒకే తాటిపైకి నిలిపే సమన్వయకర్త. రాజ్యాంగంలోని భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి  ప్రతిబింబం.1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను  మరణానంతరం అంబేద్కర్​కు ప్రకటించింది. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

మూక్​ నాయక్ పత్రికకు సంపాదకత్వం

మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక్​ నాయక్' అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు. అంబేద్కర్ ఉన్నత విద్య చదివినా జనం మాత్రం అతన్ని అంటరానివారిగానే చూసేవారు. 1927లో జరిగిన మహద్‌‌ చెరువు పోరాట సందర్భంగా అంబేద్కర్‌‌ మనుస్మృతిని దగ్ధం చేశారు.  కులానికి, అస్పృశ్యతకి మూలమైన మనుస్మృతిని తగులబెట్టడంతో ఒక్కసారిగా హిందూ సమాజం ఉలిక్కిపడి ఆయన వైపు చూసింది. విద్య మానవుడిని ప్రపంచీకరించాలని కుల వివక్ష కోరల్లోకి దింపకూడదని అంబేద్కర్‌‌ ఆశించారు. కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్యోద్యమంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు.

- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్