OTT సబ్‍స్క్రిప్షన్ అడుక్కునే వారికి భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ బాటలో అమెజాన్ ప్రైమ్

అరేయ్ నీకు నెట్‌ఫ్లిక్స్(Netflix) సబ్‍స్క్రిప్షన్ ఉందా..! అరేయ్ ఆహా(Aha) సబ్‍స్క్రిప్షన్ ఉందా..! అరేయ్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) సబ్‍స్క్రిప్షన్ ఉందా..! నలుగురు స్నేహితులు ఒక్కచోట గుమిగూడారంటే ఇవే ముచ్చట్లు. ఒక్కరు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారంటే.. నాలుగు మొబైల్లలో ఒకే లాగిన్. అటువంటి వారందరికీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ షాకిచ్చింది. సబ్‌స్క్రైబర్లు ఏకకాలంలో లాగిన్ చేయగల పరికరాల సంఖ్యను తగ్గించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. 

వినియోగదారుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ ప్రణాళికలు మొదలు పెట్టింది. ప్రస్తుతం, Amazon Prime వినియోగదారులు తమ ఖాతాలను ఏకకాలంలో 10 పరికరాల్లో యాక్సెస్ చేయవచ్చు. ఆ సంఖ్యను 5 పరికరాలకు తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. అదనంగా, వినియోగదారులు ఒకేసారి రెండు స్మార్ట్ టీవీలలో ప్రైమ్ వీడియో యాప్‌కి లాగిన్ చేయడానికి మాత్రమే అనుమతించనున్నారు. మరో ఓటీటీ సంస్థ Netflix ఇప్పటికే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తోంది. 

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు

వార్షిక ప్లాన్: రూ. 1,499 (ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రయోజనాలు).
మూడు నెలల ప్లాన్: రూ. 599
నెలవారీ ప్లాన్: రూ. 299
మొబైల్ ఎడిషన్ ప్లాన్: స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే (ప్రైమ్ వీడియోను యాక్సెస్ చేయడానికి అనుమతించే మొబైల్-నిర్దిష్ట ప్లాన్).