టెక్నాలజీ : అమెజాన్ క్లినిక్ వచ్చేసింది

అ మెజాన్​ యాప్ ఉంటే చాలు.. గ్రాసరీలు నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఫ్యాషన్ ఐటెమ్స్ నుంచి యాక్సెసరీల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే అమెజాన్ ఇప్పుడు హెల్త్ కేర్ సర్వీస్​లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

అమెజాన్ యాప్.. ఇక నుంచి హెల్త్ ఎక్స్​పర్ట్స్​ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది. వీడియో, ఆడియో, చాట్ ద్వారా వైద్యులకు యాక్సెస్ అందిస్తుంది. అమెజాన్ క్లినిక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ సేవను ఉపయోగించడానికి, యూజర్లు పేరు, వయస్సు, జెండర్, ఫోన్ నంబర్ వంటి వారి ప్రాథమిక వివరాలతో ప్రొఫైల్​ను క్రియేట్ చేయాలి. 

రిజిస్ట్రేషన్ తర్వాత, యూజర్లు హెల్త్ కండిషన్​ని బట్టి ఆన్​లైన్​లో ఎక్స్​పర్ట్స్​ని సంప్రదించవచ్చు. లేదా వ్యక్తిగత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. అందుబాటులో ఉన్న వైద్యులతో తక్షణమే కనెక్ట్ అవ్వడానికి లేదా కన్సల్టేషన్​ను ముందుగానే షెడ్యూల్ చేయడానికి యూజర్లకు యాప్ వీలు కల్పిస్తుంది. ప్రతి సంప్రదింపులు సాధారణంగా10 నుంచి 30 నిమిషాల మధ్య ఉంటాయి. డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, న్యూట్రిషన్, కౌన్సెలింగ్ వంటి విభాగాల్లో ఎక్స్​పర్ట్స్ లిస్ట్​ ఈ ప్లాట్​ఫ్లామ్​లో ఉంటుంది. 

అమెజాన్ క్లినిక్​లోని వైద్యులందరికీ కనీసం మూడు సంవత్సరాల టెలిమెడిసిన్ అనుభవం ఉంది. కన్సల్టేషన్ ఫీజు డాక్టర్ స్పెషలైజేషన్​ను బట్టి రూ.299 నుంచి రూ.799 వరకు ఉంటుంది. అదనంగా, అమెజాన్ క్లినిక్ మొదటి కన్సల్టేషన్​ తర్వాత ఏడు రోజుల పాటు అన్​లిమిటెడ్​ ఫ్రీ ఫాలో-అప్ కన్సల్టేషన్లను అందిస్తుంది. యూజర్లు హెల్త్ కేర్, రిటైల్ సేవలతోపాటు అమెజాన్ ఫార్మసీ ద్వారా సూచించిన మందులను కూడా కొనుక్కోవచ్చు.