అయోధ్య రాములోరి మీద ప్రేమతో..

రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం కట్టాలనేది భక్తుల కోరిక. వందేండ్ల పోరాటం తర్వాత ఆ కోరిక నెరవేరుతుండడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇప్పటికే గుడి కోసం దీక్షపూనిన కొందరు జనవరి 22న విరమించుకోనున్నారు. మరికొందరు భక్తితో తమ వంతుగా రామ మందిరానికి బహుమతులు ఇస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కథ.

అమెరికా టు అయోధ్య  

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందనే వార్త ఖండాంతరాలు దాటింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో రోడ్డు పక్కన ఉండే బిల్ బోర్డుల్లో అయోధ్య రామ మందిరం గురించిన ఫొటోలు ప్రదర్శించారు. అమెరికాలోని హిందువులంతా కలిసి10 రాష్ట్రాల్లో 40 కంటే ఎక్కువ బిల్​ బోర్డుల్లో అయోధ్య విశేషాలను చాటి చెప్తూ డిజిటల్ డిస్ ప్లే పై ప్రదర్శించారు. టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియాలో బిల్​ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ‘అయోధ్యకు వెళ్లడానికి అమెరికాలోని హిందువులను ఎంకరేజ్ చేయడానికి బిల్​ బోర్డ్లో ప్రదర్శించామ’ని అమెరికా విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి అమితాబ్ చెప్పారు.