చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి

  • హర్యానా గవర్నర్‌‌ బండారు దత్తాత్రేయ

యాదగిరిగుట్ట, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని హర్యానా గవర్నర్‌‌ బండారు దత్తాత్రేయ సూచించారు. వడ్డె మహాజన్‌‌ ఫౌండేఎషన్‌‌ చైర్మన్‌‌ ఉపేందర్‌‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం ప్రభుత్వ హైస్కూల్‌‌ స్టూడెంట్లకు శుక్రవారం స్టడీ మెటీరియల్‌‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. సమాజంలో అసమానతలు, పేదరికం నిర్మూలించడం, దేశాభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. 

స్టూడెంట్లు అంబేద్కర్‌‌ను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. స్టూడెంట్లు పాఠశాల స్థాయిలోనే టార్గెట్‌‌ను నిర్దేశించుకొని, దానిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కమ్యూనికేషన్‌‌ స్కిల్స్‌‌, సామాజిక సృహ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని, ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. 

చెడు వ్యసనాలను దూరంగా ఉండి, యోగా, వ్యాయామం, ఆధ్యాత్మిక, దైవచింతన అలవర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఈవో సత్యనారాయణ, తహసీల్దార్‌‌ దేశ్యానాయక్, మాజీ జడ్పీటీసీ అనురాధ, హెచ్ఎం రమాదేవి, ఎంపీవో సలీం పాల్గొన్నారు.

నారసింహుడిని దర్శించుకున్న దత్తాత్రేయ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో నారసింహుడిని దర్శించుకుని, ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భాస్కర్‌‌రావు స్వామివారి లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.