ట్రెండ్​కు తగ్గ యూనిట్ల ఏర్పాటు మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి

  • మహిళా సంఘాలకు రుణాలు
  • కాలానికి అనుగుణమైన ఉత్పత్తుల తయారీ
  •  పెరటి కోళ్లు, గేదెల పెంపకం,  మిల్లెట్స్​ ఉత్పత్తులపై  ఫోకస్​ ​​ 
  • మార్కెట్​పై అవగాహనకు శిక్షణ

 మహిళా సంఘాల సభ్యుల ఆదాయం పెంచడంతోపాటు, మార్కెట్ లో డిమాండ్​ ఉన్న వస్తువుల ఉత్పత్తులపై అధికారులు దృష్టిసారించారు.   మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తులు తయారీ,   మార్కెటింగ్​చేయడం, వినియోగదారులను ఆకర్షించే విధంగా  షాపుల ఏర్పాటు చేయటానికి   జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ   చర్యలు చేపట్టింది.    ప్రధానంగా జిల్లాలో పెరటి కోళ్లు( నాటు కోళ్లు),  గేదెలు, మిల్లెట్స్​ ప్రొడక్షన్ యూనిట్స్​తో పాటు,  కిరాణా షాపు వంటి యూనిట్లను సూపర్​ మార్కెట్లుగా మార్చనున్నారు. 

 కామారెడ్డి, వెలుగు: జిల్లాలో మొత్తం ఉన్నాయి.  17,098 మహిళా సంఘాలుండగా, వీటిలో  1.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు.  ఈ ఏడాది రూ.186 కోట్లతో  22, 007 మంది సభ్యులకు రుణాలు అందించనున్నారు.  ఈ  రుణాలు తీసుకున్న సభ్యులు మార్కెట్​లో డిమాండ్​ ఉన్న వస్తువులను తయారుచేసి ఎక్కువ లాభాలు పొందేలా గైడ్​ చేయనున్నారు.  గతంలో ఎక్కువ మంది కిరాణ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని సూపర్​ మార్కెట్లుగా మార్చి డిమాండ్​ ఉన్న వస్తువులు షాపుల్లో అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టారు.  ప్రస్తుతం మార్కెట్లో  రెగ్యులర్​​గా దొరికే ఫుడ్​ ఐటమ్స్​ కాకుండా  మిల్లెట్స్​ ఉత్పత్తులను మార్కెటింగ్​ చేయడంపై డీఆర్​డీవో యంత్రాంగం దృష్టి సారించింది.  నాన్​ వెజ్​ వినియోగం పెరిగినందుకు కోళ్ల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  మిల్లెట్స్​ ఉత్పత్తులను తయారు చేయించి స్థానిక మార్కెట్​తోపాటు, హైదరాబాద్ దగ్గరగా ఉన్నందుకు అక్కడికి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పెరటి కోళ్ల పెంపకం

జిల్లాలో2,200 మంది మహిళలకు 2,200 పెరటి కోళ్ల యూనిట్లు మంజూరు చేయాలని టార్గెట్​ పెట్టుకున్నారు. ఇప్పటికే  447  యూనిట్లను గ్రౌండింగ్​ చేయించారు.  ఒక్కో మెంబర్​ 20 నుంచి 30 కోడి పిల్లలు ఇస్తారు.   45 రోజులు పెంచినట్లయితే  కిలోన్నర  బరువు పెరుగుతుంది.  ఒక కోడి ధర రూ.110  ఉంటుంది.  కిలోన్నర కోడి మాంసం అమ్మితే రూ.270 వస్తుంది.  దీంతో ఒక్కో కోడి అమ్మితే లబ్ధిదారులకు  రూ.160 లాభం వస్తుంది.   వీటి అమ్మకం పూర్తయిన తరువాత మరో  20 నుంచి 30 కోళ్లు ఇస్తారు.  నిరంతరం వీరికి ఆదాయం ఉండేలా ప్లాన్​​ చేశారు.   

కోడి పిల్లల యూనిట్లు

పెరటి కోళ్ల పిల్లల యూనిట్లను మండలానికి ఒకటి చొప్పున కేటాయిస్తారు. జీరో కేజీ పిల్లను తీసుకొచ్చి 45 రోజుల పాటు ఇక్కడ పెంచి,  లబ్ధిదారులకు సప్లయ్​ చేయిస్తారు.   ఒక యూనిట్​ ఖర్చు రూ. 2 లక్షలు ఉంటుంది.  ఇప్పటికే ఆరు యూనిట్లు గ్రౌండింగ్​ చేశారు.  అలాగే  గేదెల యూనిట్లను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. 389 మందికి  బర్రెలు, ఆవులు పంపిణీ 
చేశారు.    

పేడతో ఉత్పత్తుల తయారీ

ఆర్గానిక్​  ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్​ ఎక్కువగా ఉంది.  ఆవు పేడతో  కొన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.  ఇటీవల మార్కెట్లో ఆవుపేడతో చేసిన దూప్ స్టిక్కులు, అగర్ బత్తీలు లభిస్తున్నాయి. ఇటువంటి  ఉత్పత్తులను జిల్లాలో మహిళా సంఘాలతో చేయిస్తారు.  ఇందుకోసం మహిళలకు ట్రైనింగ్​ఇవ్వనున్నారు. 

క్యాంటీన్​ల ఏర్పాటు

జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్లో క్యాంటీన్​ ఏర్పాటు చేశారు.  మిగతా చోట్ల మరో ఐదు క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. సదాశివనగర్, బిచ్​కుంద, గాంధారి, ఎల్లారెడ్డి, పిట్లం కేంద్రాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులకు ట్రైనింగ్​ ఇచ్చారు.  సమాఖ్య సభ్యులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ  ఇవ్వనున్నారు.  ఏపీఎంల ద్వారా మండలాల వారీగా శిక్షణ ఇస్తారు.  

ఆదాయం పెంచటమే లక్ష్యం

మారుతున్న కాలానుగుణంగా  బిజినెస్​ను మార్చటం,  మార్కెట్లో డిమాండ్​ ఉన్న వస్తువులను సప్లయ్​ చేయిస్తే  మహిళా సంఘాలకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది.  డిమాండ్​ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయించటం ద్వారా మార్కెటింగ్​ సులభతరమవుతుంది.  మహిళా సంఘాల ద్వారా ఏజెన్సీల ఏర్పాటు చేయించేలా ఫ్లాన్​ చేస్తున్నాం.  ఎప్పటికప్పుడు మార్కెట్​ను పసిగట్టే విధంగా  ట్రైనింగ్  ఇస్తాం.   
‌‌‌‌  - సురేందర్, డీఆర్​డీవో