8 ఏళ్ల క్రితం ఆసీస్‌పై అరంగేట్రం.. క్రికెట్‌కు భారత స్టార్ ఆల్‌రౌండర్ గుడ్ బై

భారత స్టార్ ఆల్ రౌండర్ రిషి ధావన్(Rishi Dhawan) పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. బరువెక్కిన హృదయంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రిటైర్మెంట్ పట్ల తనకు ఎలాంటి బాధ లేదని.. జెంటిల్మెన్ గేమ్ తనకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చిందని రిషి ధావన్ తన పోస్టులో తెలిపారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తనకు ఇచ్చిన అవకాశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నట్లు రిషి ధావన్ జోడించారు. అంటే, అతడు రంజీ ట్రోఫీ సీజన్‌లో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. 

2016లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్.. పెద్దగా రాణించింది లేదు. కేవలం మూడు వన్డేలు, ఒక టీ20లో మాత్రం కనిపించాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాడు. ఈ సీజన్‌లో భారత ఆల్‌రౌండర్ హిమాచల్ ప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడాడు.

రిషి ధావన్ దేశవాళీ కెరీర్

రిషి ధావన్ 134 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 29.74 సగటుతో 186 వికెట్లు పడగొట్టాడు. ఒక సెంచరీ సహా 2906 పరుగులు చేశాడు. ఇక 135 టీ20ల్లో 26.44 సగటుతో 118 వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో 121.33 స్ట్రైక్ రేట్‌తో 1740 పరుగులు చేశాడు. ఇక అతని ఐపీఎల్ (IPL) ప్రయాణం విషయానికొస్తే, ధావన్ 2014 నుండి 2024 వరకు కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్), 2013లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 39 మ్యాచ్‌లలో 25 వికెట్లు మరియు 210 పరుగులు చేశాడు.