భారీ వర్షాలతో అన్ని జలాశయాలకు కళకళ

  • కృష్ణా బేసిన్​లోని జలాశయాలు కళకళ
  • శ్రీశైలం, నాగార్జున సాగర్​కు భారీగా ఇన్​ఫ్లో
  • రెండు రోజుల్లో సాగర్​ గేట్లు తెరిచే చాన్స్​
  • గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే ప్రవాహాలు
  • నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు
  • 42 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నిరుడు మొత్తం వర్షాల్లేక, వరద రాక ప్రాజెక్టులు మొత్తం వట్టిబోగా.. ఇప్పుడు ఆగస్టు ఫస్ట్​ వీక్​నాటికే  ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువన కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​కు గత నెల 15 నుంచి స్వల్పంగా వరద ప్రవాహం నమోదైతే.. జూరాల ప్రాజెక్టుకు అదే నెల 19 నుంచి స్వల్పంగా ఇన్​ఫ్లో స్టార్ట్​ అయింది. 

శ్రీశైలం ప్రాజెక్టుకు జులై 20వ తేదీ నుంచి వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ కేవలం 36.56 టీఎంసీల నిల్వనే ఉంది. అది మొదలు.. జులై 22న తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం నమోదైంది. ఆ రోజు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 25, 26వ తేదీల్లో రోజూ సగటున 2.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. 

27వ తేదీ నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అంతకు రెండింతల ఇన్​ఫ్లో వచ్చింది. ఆ రోజు నుంచి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం నమోదైంది. వరుసగా 5 రోజులపాటు భారీ వరదలు కొనసాగాయి. 30వ తేదీ నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 207.41 టీఎంసీలకు చేరింది. ఆ పది రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 200 టీఎంసీలకుపైగా ఫ్లడ్​ వచ్చింది.

 జులై 30న మూడు గేట్లు తెరచి నాగార్జున సాగర్​కు నీటి విడుదలను ప్రారంభించారు. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వస్తున్నాయి. ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటు అటు తుంగభద్ర నుంచి 4,81,598 క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదవుతున్నది. దీంతో 5,52,268 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకుగానూ 202.51 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 885 అడుగులకుగానూ 882.60 అడుగుల లెవెల్​లో నీళ్లున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ జల విద్యుత్​ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తితోపాటు క్రెస్ట్​గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. 

గోదావరి వరదంతా ప్రాణహితదే

ఈ ఏడాది ఇప్పటిదాకా గోదావరి నదిలో సరైన వరద ప్రవాహం నమోదు కాలేదు. ప్రస్తుతం మేడిగడ్డ, సమ్మక్కసాగర్​, సీతమ్మసాగర్​, భద్రాచలం వద్ద నుంచి భారీగా సముద్రంలో కలిసిన వరదంతా ప్రాణహిత ప్రవాహాలేనని అధికారులు చెబుతున్నారు.  గోదావరి క్యాచ్​మెంట్​ఏరియాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈ నెల 20 నుంచి గోదావరిలో అతి స్వల్ప ప్రవాహాలు మాత్రమే నమోదయ్యాయి. 

 జులై 18న శ్రీరామసాగర్​ ప్రాజెక్ట్ కు 20,833 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎల్లంపల్లికి గత నెల 21న 42 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. సీజన్​లో ఇప్పటిదాకా అదే అధికం కావడం విశేషం. శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఈ నెల 2న 52,164 క్యూసెక్కుల ఫ్లడ్​ నమోదైంది. సీజన్​లో ఆ ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఫ్లడ్​. 

నాగార్జునసాగర్​కు వారం నుంచే వరద

నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు వారం రోజుల నుంచే వరద ప్రవాహాలు మొదలయ్యాయి. తొలిసారిగా జులై 27వ తేదీన సాగర్​ ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కులకుపైగా ఇన్​ఫ్లో వచ్చింది. గత మూడు రోజుల నుంచి 3.70 లక్షలు, 4 లక్షలు, 4.94 లక్షల క్యూసెక్కుల చొప్పున భారీ వరద ప్రవాహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ 240.83 టీఎంసీలకు నిల్వ చేరుకుంది. 

మరో రెండు మూడు రోజుల్లో సాగర్​ ప్రాజెక్టు కూడా నిండే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, జూరాల ప్రాజెక్టుకు 19నే వరద ప్రారంభం కాగా.. ఆ తర్వాత రెండు, మూడు రోజులకే ప్రాజెక్టు నిండింది. దీంతో 20వ తేదీ నుంచి జూరాల ప్రాజెక్టు ద్వారా వరదను దిగువకు విడుదల చేశారు.