నల్గొండలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

నల్లగొండ: అతి త్వరలోనే నల్గొండలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం (డిసెంబర్ 6) నార్కట్‎పల్లి మండలం బ్రహ్మణవెల్లంల ఉదయసముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‎ను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. శనివారం (డిసెంబర్ 7) సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్నందున పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు అందరూ సీఎంకి ఘన స్వాగతం పలకాలని ఇరిగేషన్ శాఖ తరపున పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కక్షతో పది సంవత్సరాలుగా ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుని పక్కన పడేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు మళ్లీ కాంగ్రెస్ వచ్చాక పూర్తయ్యాయన్నారు. 

బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు కెనాల్ పనులను 50 శాతం వారం రోజుల్లోనే పూర్తి చేసి 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. అందుకు అవసరమైన బడ్జెట్‎ను 5 రోజులో విడుదల చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రారంభి.. మా ప్రభుత్వ హయాంలోనే  పూర్తి చేస్తామన్నారు. 

ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకు వెళ్లి మిషన్ కొనుగోలు చేశారని.. అది నెల రోజులలో వస్తుంది. రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీరు వస్తే నల్గొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు నిరంతరం సాగునీరు అందుతుందని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో పెండింగులో ఉన్న ధర్మారెడ్డి పల్లి పిల్లాయిపల్లి కాల్వ పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు.