Indian Salt: వామ్మో.. మన ఉప్పుతో ఇంత ముప్పుందా.. అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా..

ఉప్పు, చక్కెర కొనే ముందు ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి. ఎందుకంటే.. మన దేశంలోని అన్ని ఇండియన్ బ్రాండ్స్ విక్రయిస్తు్న్న ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ కలిసినట్టుగా తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చిన్న ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ అని తేడా లేదు. ప్యాకేజ్డ్ లేదా అన్ ప్యాకేజ్డ్ అనే తేడా లేదు. టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు (Sea Salt), కళ్లుప్పు.. ఇలా ఇండియాలో వినియోగించే 10 రకాల ఉప్పుపై, ఐదు రకాల చక్కెరపై టాక్సిక్స్ లింక్ పరిశోధన చేసింది. ఈ ఉప్పును, చక్కెరను ఆన్లైన్తో పాటు లోకల్ మార్కెట్స్ నుంచి కొనుగోలు చేసి మరీ పరిశోధన చేశారు. 

ఇంత పరిశోధన చేయగా తేలిందేంటంటే.. ఇండియాలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని స్పష్టమైంది. కాకపోతే.. ఈ మైక్రోప్లాస్టిక్స్ రకరకాల రూపాల్లో ఉందని వెల్లడైంది. ఫైబర్, పెల్లెట్స్.. ఇలా ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం 0.1 నుంచి mm 5 mm వరకూ ఉందని అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీకి చెందిన టాక్సిక్స్ లింక్ సంస్థ ఇండియన్ ఉప్పుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. సూపర్ మార్కెట్స్కు వెళ్లినప్పుడు అయోడైజ్డ్ ఉప్పు ఆరోగ్యానికి మంచిదని, అదే కావాలని కోరి మరీ కొంటుంటారు. కానీ.. ఆ అయోడైజ్డ్ సాల్ట్లోనే మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనంపై టాక్సిక్స్ లింక్ ఫౌండర్-డైరెక్టర్ రవి అగర్వాల్ మాట్లాడుతూ.. మైక్రోప్లాస్టిక్స్ కలిసి ఉన్న ఉప్పును, చక్కెరను వాడటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్పై కచ్చితంగా ఆలోచన చేయాలన్నారు. కిలో ఉప్పులో దగ్గరదగ్గర 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. 89.15 మైక్రోప్లాస్టిక్ అవశేషాలు అయోడైజ్డ్ సాల్ట్లో ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. కళ్లుప్పులోనే అతి తక్కువ స్థాయిలో 6.70 మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని వెల్లడైంది. అంటే.. అయోడైజ్డ్ ఉప్పు కంటే కళ్లుప్పే అన్ని విధాలా ఆరోగ్యానికి మంచిదనమాట. 

Also Read:-హమ్మయ్య.. స్పామ్ కాల్స్ చికాకుపై ట్రాయ్ కీలక ఆదేశాలు

చక్కెరలో కూడా మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు తేలింది. కిలో చక్కెరలో అత్యల్పంగా 11.85 నుంచి అత్యధికంగా 68.25 మైక్రోప్లాస్టిక్ ముక్కలు కలిసి ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. మైక్రోప్లాస్టిక్ కేవలం మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా పెను ముప్పు. ఆహారం, నీళ్లు, గాలి ద్వారా ఈ మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి వెళుతున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి వెళ్లడం వల్ల ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు, చివరికి తల్లి పాలను కూడా హానికరంగా మార్చుతున్నాయని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. సగటు భారతీయుడు ఒక రోజుకు 10.98 గ్రాముల ఉప్పు, 10 స్పూన్ల చక్కెర తింటున్నట్లు తెలిసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు మించి ఉప్పు, చక్కెరను భారతీయులు తింటున్నారు. మైక్రోప్లాస్టిక్స్ కలిసిపోయి ఉన్నాయనే విషయం తెలిశాక అయినా మన దేశంలో ఉప్పు, చక్కెరను తక్కువ తింటారో లేదా ఎప్పటిలానే లాగించేస్తారో చూడాలి.