నలుగురు కొడుకులున్నా.. కన్నతల్లిని శ్మశానంలో వదిలేసిన్రు

జగిత్యాల, వెలుగు: నలుగురు కొడుకులున్నా తల్లిని అనాథగా వదిలేశారు. పింఛన్ పైసల కోసం తాగుడుకు బానిసైన చిన్న కొడుకు కొట్టడంతో వృద్ధురాలు కాలు విరిగింది. దీంతో ఆమెను పట్టించుకోకుండా శ్మశానంలో వదిలివెళ్లగా బతుకు వెళ్లదీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల టౌన్ లోని చిలుకవాడకు చెందిన రాజవ్వ తన భర్త చనిపోగా, నలుగురు కొడుకులను పెంచి పెద్ద చేసింది. ఏ కొడుకూ తల్లిని పట్టించుకోవడంలేదు. ఆపై ఇంట్లోంచి వెళ్లగొట్టారు.  రోడ్డున పడి స్థానికులు పెట్టినది తింటూ పూట గడుపుతుంది. తాగుడుకు బానిసైన చిన్న కొడుకు పింఛన్ పైసలు ఇవ్వలేదని తల్లిని కొట్టడంతో కిందపడ్డ రాజవ్వ కాలు విరిగింది. 

కదలేని స్థితిలో ఉన్న ఆమెను చివరకు మోతె రోడ్ లోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు. అక్కడి రూమ్ లో ఉంటూ స్థానికులు పెట్టేది తింటూ కాలం వెళ్లదీస్తోంది.  ఎనిమిది రోజులుగా చలిలో కాలి గాయాలతో మూలుగుతూ వృద్ధురాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో అక్కడే మల, మూత్ర విసర్జన చేస్తుండగా తీవ్ర దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వయో వృద్ధుల సంక్షేమ జిల్లా అధికారి నరేశ్​కు సమాచారం అందించారు.  బుధవారం సిబ్బంది వెళ్లి వృద్ధురాలు రాజవ్వను సఖి కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని, వయోవృద్ధుల చట్టం ప్రకారం ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారి నరేశ్​తెలిపారు.