భువనగిరి నియోజకవర్గంలో..పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి

  •     మొత్తం 18,08,585 ఓటర్లు
  •     2,141 పోలింగ్​ సెంటర్లు
  •     ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  •     ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు : భువనగిరి నియోజకవర్గంలో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శనివారం యాదాద్రి కలెక్టరేట్​లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్​ పోలింగ్​సమయాన్ని గంట పెంచిందని తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చని చెప్పారు. భువనగిరి పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 18, 08,585 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

వీరిలో 8,98,416 మంది పురుషులు, 9,10,090 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. 46,665 మంది దివ్యాంగులు, 85 ఏండ్లకు పైబడిన వారు 10,945 మంది, థర్డ్​జెండర్స్​79 మంది ఉన్నారని వివరించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 58 వివిధ టీములు పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. 245 సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వసతులు కల్పించామన్నారు. 1,325 లోకేషన్స్​లో వీల్ చైర్​ఏర్పాటు చేశామని చెప్పారు.

చూపులేని ఓటర్లకు బ్రెయిలీ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈవీఎంకు సంబంధించి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 125 శాతం, వీవీ ప్యాట్లు 140 శాతం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 99.30 శాతం స్లిప్పులు ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో భాగంగా హోమ్ ఓటింగ్ సంబంధించి 1,364 మందికి 1,266 మంది ఓటు వేశారని, 11,193 మంది పోస్టల్​బ్యాలెట్​లో ఓటు వేశారని తెలిపారు. 

పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం 

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్​ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు అన్నారు. సూర్యాపేటలోని ఈవీఎం, స్రాంగ్​రూమ్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఈనెల 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలోనికి వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు.

ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను పంపిణీ చేశామన్నారు. రేపు డిస్ట్రిబ్ర్యూషన్ సెంటర్ల నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బందితోపాటు ఈవీఎంలు చేరుకుంటాయని తెలిపారు. జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల 229 ఉన్నాయని చెప్పారు. 112 రూట్లలో 123 సెక్టార్ అధికారులను నియమించామన్నారు.  ఓటర్లు ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 

నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్​ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయపరిశీలకుడు, ఐఆర్ఎస్ అధికారి కల్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు.  ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు క్యాండిల్ వాక్ నిర్వహించారు. కలెక్టర్​ దాసరి హరిచందనతో కలిసి క్యాండిల్​వాక్​ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరగనున్న లోక్​సభ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 90 శాతం పోలింగ్ అయ్యే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాసామాన్ని పరిరక్షించాలని కోరారు.