ముక్కోటి ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం, వెలుగు :  ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్ ​తెలిపారు. వైకుంఠద్వార దర్శనం, గోదావరి ఘాట్, స్టాల్స్, విడిది గృహాలు ఏర్పాట్లను మంగళవారం రాత్రి కలెక్టర్​ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో ఈనెల 9,10 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసినట్లు  చెప్పారు.

జిల్లా చరిత్రను టూరిస్టులకు తెలియజేసేందుకు ఏరు(రివర్​) ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఫెస్టివల్​లో గిరిజన ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాకృతులు, వంటకాలు, పాతకాలపు ఆభరణాలు, ఔషధ గుణాల ఆహార పదార్థాల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గిరిజన కళాప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. టూరిస్టులు బస చేసి మరుసటి రోజు బొజ్జిగుప్ప, కిన్నెరసాని, బెండాలపాడు, ఐటీడీఏలోని ట్రైబల్​ మ్యూజియం సందర్శన ప్రత్యేక ప్యాకేజీకి రూ.6వేలు  చార్జీగా నిర్ణయించామన్నారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో దామోదర్, ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్​,తహసీల్దారు శ్రీనివాస్​పాల్గొన్నారు.

అటవీ భూములను గుర్తించాలి

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో అటవీ భూములను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఆఫీసర్లను కలెక్టర్​ జితేశ్​ఆదేశించారు. కలెక్టరేట్​నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అన్ని మండలాల్లో గల అటవీశాఖ భూముల వివరాలను ఫారెస్ట్​ శాఖ గెజిటెడ్​, రెవెన్యూ రికార్డులతో సరి చూసి ఏ సర్వే నెంబర్లలో ఎంత అటవీ భూములున్నాయో గుర్తించాలన్నారు. మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్​ పోర్టు, ఇరిగేషన్​ ప్రాజెక్టులు, రోడ్లతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. భూమాత మాడ్యూల్​ అమలుకుముందే మాడ్యూల్స్​లలో సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు. 

కనిగిరిగుట్టల సందర్శన 

చండ్రుగొండ :  బెండాలపాడు శివారులోని కనిగిరిగుట్టలు, బ్యాంబో క్లస్టర్ ను కలెక్టర్​జితేశ్​ సందర్శించారు. ముక్కోటి సందర్భంగా భద్రాచలం వచ్చే టూరిస్టులు 11న కనిగిరి గుట్టలను సందర్శిస్తారని,  వారికి అసౌకరం లేకుండా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు.  కలెక్టర్  గిరిజన, ఆదివాసీ సంప్రదాయాల వంటకాలు, బ్యాంబో  క్లస్టర్ వద్ద వెదురు  కర్రలతో బేస్ క్యాంపు షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సెర్ఫ్  మహిళలు తయారు చేసిన  వంటకాలతో కలెక్టర్  భోజనం చేశారు.