సీ5 కాంట్రాక్టర్​ కేసీఆర్‌‌కే కనిపిస్తడు.. పనుల ​పేరుతో ఇసుక అమ్ముకున్న కాంట్రాక్టర్లు

  • ప్రొటోకాల్‌పై నిర్లక్ష్యం వద్దు
  • కొండలు, గుట్టలకు రైతుబంధు రాదు
  • తాగునీటి కోసం చెరో రూ.2 కోట్లు ఇస్తాం
  • జడ్పీ మీటింగ్‌లో ప్రభుత్వ విప్​బీర్ల, ఎమ్మెల్యే సామెల్

యాదాద్రి, వెలుగు: జిల్లాలో పలు పనులు చేపట్టిన సీ-5 కంపెనీ కాంట్రాక్టర్ మాజీ సీఎం కేసీఆర్‌‌కు మాత్రమే కనిపిస్తాడని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎద్దేవా చేశారు. మంగళవారం జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సంజీవరెడ్డి అధ్యక్షతన  జడ్పీ మీటింగ్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా సీ-5 కంపెనీ కాంట్రాక్ట్​ తీసుకున్న పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని మెంబర్లు సభ దృష్టికి తెచ్చారు. 

స్పందించిన ఎమ్మెల్యే పనుల విషయంలో మాట్లాడడానికి సీ-5 కాంట్రాక్టర్​ అందుబాటులోకి రాడని మండిపడ్డారు. ఆయన కేసీఆర్​కు మాత్రమే కనిపిస్తాడని కామెంట్​చేశారు. నాలుగేండ్లుగా మీటింగ్​జరిగిన ప్రతిసారి పెండింగ్​పనులపై చర్చ జరుగుతుందని, కొందరు కాంట్రాక్టర్లు పనుల పేరుతో ఇసుక అమ్ముకున్నారని ఆరోపించారు. పెండింగ్​పనులు ఎప్పుడు పూర్తి చేయిస్తారని ఆర్​అండ్​బీ ఈఈ శంకరయ్యను నిలదీయగా..  కొన్ని పనులు మూడు నెలల్లో కంప్లీట్​ చేయిస్తానని తెలిపారు.  బిల్లులు రావడం లేదని పనులను పెండింగ్‌లో పెట్టిన కాంట్రాక్టర్లు మళ్లీ కొత్త టెండర్లలో ఎలా పాల్గొంటారని పలువురు మెంబర్లు ప్రశ్నించారు. పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

తాగునీటి కోసం రూ.4 కోట్లు

ఎండా కాలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తమ కోటా నుంచి రూ.  2 కోట్ల చొప్పున కేటాయిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. పంచాయతీల్లో సర్పంచ్​లు లేనందున స్పెషలాఫీసర్లు చొరవ తీసుకొని తాగునీటి కొరత రాకుండా చూడాలని సూచించారు. ప్రొటోకాల్​ విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మెంబర్లు ఆరోపించగా.. మాజీ ఎమ్మెల్యే పేరుతో శిలాపలకం ఏర్పాటు చేయడం ఏంటని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నిలదీశారు. ప్రొటోకాల్​పై ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

కొండలు, గుట్టలకు రైతుబంధు రాదు

ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ కొండలు, గుట్టలు, రాళ్లు, వెంచర్లకు ఇక నుంచి రైతుబంధు పడదన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్​కు సంబంధించి ఇప్పటివరకూ 4 ఎకరాలకు లోపు ఉన్న రైతులకు రైతుబంధు పడిందన్నారు. నెలాఖరుకు రైతులందరి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు.  కలెక్టర్​హనుమంతు జెండగే మాట్లాడుతూ.... ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి క్రింద  రూ.500 వందలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి క్రింద 200 యూనిట్లు ఉచితం పథకాలకు అమలవుతున్నాయని తెలిపారు. స్పెషల్ డ్రైవ్​లో పూర్తి వివరాలు అందించని వారు ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో ఆధార్ కార్డు, గ్యాస్ కంపెనీ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఎలక్ట్రిసిటీ సర్వీసు నెంబరు అందించాలని సూచించారు.  

Also Read: గాడితప్పిన ఆసుపత్రి నిర్వహణ! 

జడ్పీ చైర్మన్​ రన్నింగ్​ కామెంటరీ.. తప్పు పట్టిన ఎమ్మెల్యే సామెల్

పలు అంశాలపై మెంబర్లు మాట్లాడుతుండగా జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి రన్నింగ్​ కామెంటరీ చేశారు. ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతుండగా మధ్యమధ్యలో సందీప్​రెడ్డి జోక్యం చేసుకున్నారు. దీన్ని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  సీరియస్​గా సభ్యులు మాట్లాడుతుంటే జోక్యం చేసుకోవడం సరికాదని హితవుపలికారు. మీటింగ్​లో కలెక్టర్​ హనుమంతు జెండగే, జడ్పీ సీఈవో ఎన్​ శోభారాణి, కాంగ్రెస్​ ప్లోర్​ లీడర్​ డాక్టర్​ కుడుదుల నగేశ్​, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.