ఆలేరును నంబర్ వన్ గా నిలుపుతా : బీర్ల ఐలయ్య

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలుపుతానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో రూ.18 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి మొట్టమొదటి సారిగా గోదావరి జలాలు తెచ్చామని తెలిపారు.

నెల రోజుల వ్యవధిలో నియోజకవర్గంలో దాదాపుగా 120 చెరువులను నింపామని, వారం రోజుల్లో మిగతా చెరువులన్నింటినీ నింపుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.500 కోట్ల నిధులు తెచ్చి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, లింకు రోడ్లు, హైలెవల్ బ్రిడ్జీలతోపాటు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ బిల్డింగులను నిర్మించి అభివృద్ధికి నాంది పలికామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.