ప్రధాని పదవిపై అఖిలేశ్ ​నజర్?

 ఇంగ్లండ్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ 60 ఏండ్ల క్రితమే ‘రాజకీయాల్లో ఒక వారం చాలా ఎక్కువ కాలం’ అని వ్యాఖ్యానించారు. వారం రోజుల క్రితం వరకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్ జాతీయ రాజకీయాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఉత్తరప్రదేశ్‌‌ రాజకీయాలపైనే ఆయన మక్కువ చూపారు. అయితే,  హఠాత్తుగా కన్నౌజ్ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు అఖిలేశ్ యాదవ్ ప్రకటించి.. తను కూడా  ప్రధాని రేసులో ఉన్నాను అని సమాజ్​వాది అధ్యక్షుడు  స్పష్టం చేశారు. 2000లో అఖిలేశ్​ తొలిసారి కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

అఖిలేశ్ యాదవ్ 2012లో అత్యంత పిన్న వయస్కుడైన  ఉత్తరప్రదేశ్‌‌ ముఖ్యమంత్రిగా రాజకీయ రికార్డుల్లోకి ఎక్కారు. ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​కు మైనారిటీ వర్గాల మధ్య అభిమానం, పాపులారిటీ ఉంది. కానీ, అదే సమయంలో అగ్రవర్ణాలు, ఓబీసీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అఖిలేశ్​యాదవ్​ జాగ్రత్త పడ్డారు. మైనార్టీలతోపాటు హిందువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించేవారు.

అఖిలేశ్ హఠాత్తుగా ఎందుకు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు?

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ  ఓటమిపాలైతే  తను  ప్రధానమంత్రి కావాలని అఖిలేశ్​ యాదవ్ భావించి ఉండాలి. మరొకరు ప్రధానమంత్రి అయ్యేందుకు తనెందుకు పని చేయాలని ఆయన  భావించి ఉండవచ్చు.  అఖిలేశ్​ యాదవ్​కు  దేశవ్యాప్తంగా  ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంది.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ​ అధినేత్రి మమతా బెనర్జీ,  బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​, తమిళనాడు స్టాలిన్​ సారథ్యంలోని డీఎంకేతోపాటు ఎడీఎంకే,  సీపీఐ,  సీపీఎం ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతోపాటు శరద్ పవార్, ఉద్ధవ్​ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్​ నాయకులకు అఖిలేశ్​యాదవ్​ ఆప్తుడు. 

 భారతదేశంలోని  దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకు అత్యంత ఆమోదయోగ్యుడు. అఖిలేశ్​ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తాడన్న భావన ఆయా పార్టీల అగ్ర నాయకత్వానికి లేదు. మరోవైపు  కాంగ్రెస్ పుంజుకుంటే ఉత్తరప్రదేశ్‌‌లో తన ఓటు బ్యాంకుకు కాంగ్రెస్‌‌ పార్టీ నుంచి  ముప్పు ఎదురవుతుందని అఖిలేశ్​ అంచనా వేసి ఉండొచ్చు.  అందువల్ల, పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా.. అఖిలేశ్​ ప్రధానమంత్రి పదవి రేసులో ఉండటంతోపాటు రాహుల్ గాంధీని పరోక్షంగా నిలువరించడానికి ఇండియా కూటమికి అందుబాటులో ఉన్నాడు.  అఖిలేశ్​ యాదవ్ ప్రధాని అభ్యర్థి అని యూపీ ప్రజలు భావిస్తే.. ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఎక్కువ మంది సమాజ్​వాది పార్టీకి ఓటు వేస్తారని ఆయన వ్యూహం కావొచ్చు. 

రాహుల్​ ప్రత్యర్థి అఖిలేశ్ 

కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి అఖిలేష్ నుంచి తక్షణ ముప్పు పొంచి ఉంది. మమతా బెనర్జీతో పాటు మరికొందరిని తప్పకుండా అఖిలేశ్ యాదవ్​ సంప్రదించి ఉంటారనడంలో సందేహం లేదు. అఖిలేశ్​ చాలామంది వంశపారంపర్య రాజకీయ నాయకుల మాదిరిగానే కాలిక్యులేటివ్​గా ఉండటంతోపాటు ఆయనకు  వ్యక్తిగత చరిష్మా ఉంది. కానీ, అఖిలేశ్​ యాదవ్ ఇతరుల మాదిరిగా బహిరంగంగా అహంకారంగా ప్రవర్తించరు. 2016లో అఖిలేశ్​ తన తండ్రిని సమాజ్‌‌వాదీ పార్టీ నుంచి తొలగించినప్పుడు ‘కొన్నిసార్లు మీరు ఇష్టపడేవారిని రక్షించడానికి, మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.

 అలాగే నేను కూడా తీసుకోవలసి ఉంటుందని భావించాను’ అని చెప్పారు. అలాంటి రాజకీయ చాణక్యుడు మరో ఇతర ప్రతిపక్ష నాయకుడిని అందలం ఎక్కించాలని అనుకుంటారా? అఖిలేశ్​ యాదవ్ జాతీయ రాజకీయ ప్రవేశం.. ప్రధానమంత్రి పదవి మంత్రంగా మారింది. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ వంటి ప్రతిష్టాత్మక నాయకులు ఉన్నారు.  ప్రతి నాయకుడికి అదృష్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలుసు.  జైలుకు వెళ్లకముందు కేజ్రీవాల్ కూడా ఆకర్షణీయమైన నాయకుడిగా ఉన్నారు. ఈ నేతలందరినీ పోల్చి చూస్తే.. ప్రధాని పదవి రేసులో సమాజ్​వాది​ పార్టీ అధినేత  అఖిలేశ్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నారు. 

అఖిలేశ్​ యాదవ్ పై కాంగ్రెస్ ఆందోళన

కచ్చితంగా రాహుల్ గాంధీ ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మక వ్యక్తి అఖిలేశ్​యాదవ్ నుంచి పోటీని ఎదుర్కొంటారు. వాస్తవం ఏమిటంటే రాహుల్​గాంధీకి అఖిలేశ్​ యాదవ్  తీవ్రమైన ప్రత్యర్థి.  ప్రస్తుతం, ఈ ప్రత్యర్థులు స్నేహపూర్వకంగా, నవ్వుతూ ఉన్నారు. అయితే, వీరి రాజకీయ వ్యూహాలు తెలియాలంటే ఎన్నికల  ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.  కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి చాలామంది ఇండియా కూటమి భాగస్వాములు తమకు కాంగ్రెస్  నాయకుడు ప్రధానమంత్రిగా వద్దు అని బహిరంగంగానే చెప్పారు.  కానీ, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు.

 అయితే, ఇవన్నీ బీజేపీకి మెజారిటీ రాకపోతే జరగబోయే పరిణామాలు.  తనను ప్రధాని అభ్యర్థిగా చూడటం వల్ల నష్టమేమీ లేదని అఖిలేశ్​యాదవ్ భావిస్తున్నారు!  రాహుల్ గాంధీ ప్రత్యర్థులందరిలో అత్యంత ప్రభావవంతమైన నేత అఖిలేశ్​యాదవ్.  ఇది అఖిలేశ్​ కూడా పూర్తిగా ఊహించనిది.  తాను భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్​కు  ముఖ్యమంత్రిగా పనిచేసినందున తనకు గొప్ప పాలనా అనుభవం ఉందని అఖిలేశ్​ అన్నారు.  కాగా, చాలామంది  భారత ప్రధానులు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు.  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా యూపీ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యూహాత్మకంగా పార్లమెంటుకు పోటీ చేసేందుకు అఖిలేశ్​ హఠాత్తుగా ఎత్తుగడ వేశారు. మరి అఖిలేశ్​ యాదవ్ అదృష్టవంతుడో కాదో  వేచిచూద్దాం! 

ఇండియా కూటమిలో రాజకీయ పోటీ

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో రహస్య రాజకీయాలు, నాయకుల మధ్య  రాజకీయ పోటీ నెలకొంది.  శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్‌‌ తదితర నేతలు కాంగ్రెస్‌‌ నాయకుడు ప్రధానమంత్రి పదవిని అధిష్టించాలని కోరుకోవడం లేదు. అయితే,  పార్లమెంటుకు పోటీ చేయాలని ఇండియా కూటమి నేతలు అఖిలేష్ యాదవ్‌‌కు సూచించి ఉండవచ్చు. వారంతా అఖిలేశ్​ యాదవ్‌‌కు సైలెంట్‌‌గా లేదా మరికొందరు బహిరంగంగా మద్దతు ఇస్తారు. అఖిలేశ్​ యాదవ్  తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతోపాటు, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలోని కేసీఆర్ ప్రాంతీయ పార్టీని కూడా అట్రాక్ట్​ చేయగలడు. మరోవైపు హిందీ రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ తర్వాత అఖిలేశ్​యాదవ్​ అతిపెద్ద నాయకుడు.  ఓబీసీలుతోపాటు  మైనారిటీలు అఖిలేశ్​ను ఎక్కువగా ఇష్టపడతారు. 

అఖిలేశ్ ​విభిన్న నేత

అఖిలేశ్​ యాదవ్ గట్టి పట్టు ఉన్న రాజకీయ నాయకుడు. రాజకీయ చతురుడు.  అఖిలేశ్​ యాదవ్  ముఖ్యమంత్రి పదవిలో  ఉన్నప్పుడు ఆయన తండ్రి ములాయం సింగ్‌‌ యాదవ్​ సమాజ్‌‌వాదీ పార్టీపై పట్టు కోల్పోవాల్సి వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. అఖిలేశ్​ తన తండ్రి, బంధుగణంపై బలమైన రాజకీయ పద్ధతులను ఉపయోగించాడు. 2016  డిసెంబరులో  లక్నోలో అఖిలేశ్​ యాదవ్ తన తండ్రి నుంచి  మైక్​ లాక్కొని తన బంధువులను  బయటకు నెట్టిన దృశ్యాన్ని ఎవరు మర్చిపోగలరు?.  500 సంవత్సరాల క్రితం షేక్‌‌స్పియర్ ‘ఆశయాన్ని దృఢమైన అంశాలతో తయారు చేయాలి’  అని  చెప్పాడు.  రాజకీయ ఆశయానికి కనికరంలేని నిర్దయత్వం అవసరమని షేక్​స్పియర్​ వ్యాఖ్యానానికి అర్థం.  ఇప్పటికే అఖిలేశ్​ యాదవ్‌‌ తను ఓ  రాజకీయ ధురంధరుడుని అని నిరూపించుకున్నాడు.

డా. పెంటపాటి పుల్లారావు
పొలిటికల్​ ఎనలిస్ట్​