దేశ నిర్మాణంలో విద్యార్థి పరిషత్​

దేశ సర్వాంగన వికాసం కోసం, విద్యార్థి, యువకులను చైతన్య పరుస్తూ, విద్యారంగ సమస్యలతో పాటు, సామాజిక సమస్యల పరిష్కార దిశగా నిరంతరం కృషి చేస్తూ, విద్యార్థులలో జాతీయ భావాలను పెంచుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పున:నిర్మాణం అనే బృహత్తర లక్ష్యంతో 1949 జులై 9 న, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పడింది. నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెడుతున్న సందర్బంగా యావత్ విద్యార్థి లోకానికి ఏబీవీపీ 76వ ఆవిర్భావ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతోంది. 

75 ఏండ్లుగా ‘పరిషత్’​ నిరంతర కృషి

దేశంలో మారుమూల గ్రామాల నుండి మహా నగరాల వరకు విస్తరిస్తూ ప్రతి విద్యార్థికి అండగా ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా పరిషత్ కార్యకర్తలు ముందుండి పరిష్కరిస్తున్నారు. అవి కళాశాలలో మౌలిక వసతులు కావొచ్చు, ఫీజు రీయింబర్స్, హాస్టల్స్ సమస్యలు, అకాడమిక్ సమస్యలు ఇలా విద్యార్థుల సమస్యలే కాదు, దేశం కోసం నిరంతరం జాగృతమై పని చేస్తున్న సంస్థ ఏబీవీపీ. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్.. నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ నలుమూలలా విస్తరిస్తూ 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోంది. గడిచిన 75 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ మరెన్నో విజయాలను చూసింది.  ఇంజినీరింగ్ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు కోసం, ‘సృజన’ మెడికల్ విద్యార్థుల కోసం ‘మెడిషన్’,  విదేశీ విద్యార్థుల కోసం 'WOSY', నార్త్​ఈస్ట్​ స్టేట్ విద్యార్థుల కోసం ‘SEIL’, గిరిజన విద్యార్థుల కోసం ‘వనవాసి’, పర్యావరణ పరిరక్షణ కోసం ‘స్టూడెంట్ ఫర్ డెవలప్​మెంట్’, విద్యార్థులలో సేవాభావం పెంచడం కోసం స్టూడెంట్ ఫర్ సేవ, విద్యార్థినిల్లో  ధైర్య సాహసాలను వెలికి తీస్తూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేవిధంగా ‘మిషన్ సాహసి’,విద్యార్థి కళాకారులకు ‘కళామంచ్’, ఐఐటీ, నిట్ స్థాయి విద్యార్థులకు థింక్ ఇండియా, పరిశోధన విద్యార్థుల ప్రోత్సాహం కోసం ‘శోధ్​’, అదేవిధంగా ఫార్మా విజన్, అగ్రివిజన్, జిజ్ఞాస, సావిష్కర్,  ఇలా అనేక రకాల రంగాలలో విద్యార్థులకు లీడర్​షిప్ అందిస్తూనే, దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఇలా జాతీయ పునర్​నిర్మాణం మహా యజ్ఞంలో అనేకమంది పనిచేశారు. వారు పరిషత్ నేర్పిన క్రమశిక్షణ, కార్యదీక్షతతో దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. జాతీయవాద సిద్ధాంతం కోసం, పేద విద్యార్థుల కోసం పరిషత్ కార్యకర్తలు చేసిన ప్రాణత్యాగాలు మరువలేనివి.

తెలంగాణ కోసంపోరాడిన చరిత్ర

నాడు తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని తొంబై ఆరులోనే నెల్లూరులో జరిగిన ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​లో తీర్మానం చేసిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏబీవీపీ. మలిదశ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ పెద్దన్న పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనకు అనేక వినూత్న కార్యక్రమాలు చేసి విద్యార్థి లోకాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని నిస్వార్థంగా ఉద్యమం వైపు నడిపించిన ఘన చరిత్ర ఏబీవీపీ సొంతం. కరోనా కారణంగా దేశమంతా ఇండ్లకే పరితమైన పరిస్థితులలో ఏబీవీపీ దేశవ్యాప్తంగా ముందుండి ప్రాణాలను సైతం లెక్కచేయక సమాజసేవ వారియర్ లుగా పనిచేసిన విషయం విదితమే. రాబోవు రోజుల్లో ఏబీవీపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినూత్న కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏ పనికైనా ఏబీవీపీ ఎప్పుడూ ముండుంటుంది. 

- పి. శ్రీహరి,ఏబీవీపీ,సెంట్రల్ మీడియాకమిటీ మెంబర్ (ఓయూ)