V6 Special : ఆ ఆంజనేయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి.. వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది..!

యుద్ధంలో గెలిచిన తర్వాత రాజులు విజయానికి గుర్తుగా అఖండ జ్యోతులను వెలిగించే వాళ్లు. కానీ.. బొబ్బిలి రాజ వంశానికి చెందిన ఒక రాజు శత్రువులపై యుద్ధానికి వెళ్తూ వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామంలోని ఆంజనేయస్వామి అలయంలో అఖండ జ్యోతిని వెలిగించాడు. ఆయన యుద్ధం చేసి తిరిగి వచ్చేవరకూ ఆ జ్యోతి ఆరిపోకుండా వెలుగుతూనే ఉందట. అప్పటినుంచి ఆ అఖండ జ్యోతి వెలుగుతూ ఉండేలా చూసుకుంటున్నారు గ్రామస్తులు.

 గోపాల్పేట, వెలుగు : మున్నమార్ గ్రామం సుమారు మూడు ఏళ్ల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. ఒక రోజు బొబ్బిలి రాజులు దక్షిణం వైపు ఉన్న రాజ్యంపై దండయాత్ర చేయడానికి బయల్దేరారు. గోపాల్ పేట సంస్థానాన్ని దాటి వెళ్తున్నప్పుడు. ఒక చెట్టు పొదలో ఆంజనేయుడి విగ్రహం ప్రకాశిస్తూ కనిపించిందట. వెంటనే ఆ రాజులు విగ్రహం చుట్టూ బండరాళ్లు పేర్చి గుడిలా కట్టారు. 'మేము తలపెట్టే కార్యంలో విజయం సాధించాలి' అని వేడుకున్నారు.

ఆముదం నూనెతో జ్యోతిని వెలిగించి, యుద్ధానికి వెళ్లారు. వాళ్లు కోరుకున్నట్లే యుద్ధంలో విజయం వాళ్లనే వరించింది. తిరుగు ప్రయాణంలో ఆ ఆంజనేయుడి దగ్గర ఆగారు. ఆశ్చర్యంగా... వెళ్లేటప్పుడు వాళ్లు వెలిగించిన జ్యోతి అప్పటికీ వెలుగుతూనే ఉంది. దీంతో ఆ అఖండజ్యోతి నిత్యం వెలుగుతూ ఉండేలా చూడాలని గోపాల్ పేట సంస్థానాధీశులను బొబ్బిలి రాజులు ఆదేశించారు. అప్పటి నుంచి సంస్థానాధీశులు అందరూ జ్యోతి సంరక్షణ చూసుకున్నారు. గోపాలపేట సంస్థానాధీశురాలు రాణి రంగనాయకమ్మ ప్రతి నెలా ఈ ఆలయానికి ఆముదం నూనె పంపించేది.

 అంతేకాదు.. దీపాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా పూజారిని కూడా నియమించింది. ఆ పూజారి వంశానికి చెందిన వాళ్లే ఇప్పటికీ ఇక్కడ పూజలు చేస్తున్నారు. గ్రామంలో పాడి పంటలు, సుఖశాంతులు, సిరిసంపదలకు కారణం ఈ అఖండజ్యోతేనని నమ్ముతున్నారు ఆ గ్రామ ప్రజలు. అందుకే చందాలు వేసుకుని ప్రస్తుతం ఉన్న పూజారికి ఇస్తూ అఖండజ్యోతి ఆరిపోకుండా చూస్తున్నారు.

ఆఖండ జ్యోతికి అండగా ఉన్నాం

మా తాత ముత్తాతల కాలం నుంచి మేము వంశపారంపర్యంగా అఖంద జ్యోతిని కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో గోపాల్ పేట సంస్థానం నుంచి ఈ ఆలయానికి కావాల్సిన వసతులు కన్పించేవాళ్లు. ఆ తర్వాత గ్రామస్తులే అన్ని పూజా కార్యక్రమాలకు, అఖండ జ్యోతికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 పూజారి, వెంకటయ్య, మున్ననూరు

V6 వెలుగు స్పెషల్