సింగరేణిని కాపాడుకునేందుకు కలిసిరావాలి : ఏఐటీయూసీ ప్రెసిడెంట్​ సీతారామయ్య

  • ఏఐటీయూసీ ప్రెసిడెంట్​ సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుంటూ, సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు, యూనియన్  లీడర్లు కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. భవిష్యత్​ తరాలకు ఉపయోగపడేలా సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడానికి ఏఐటీయూసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం జీడీకే ఓసీపీ–5లో జరిగిన గేట్  మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.34 వేల కోట్లను చెల్లించాలని, లేకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమని పేర్కొన్నారు.

కొత్త గనులు రావాలంటే సంస్థకు బడ్జెట్  అవసరమన్నారు. సింగరేణిలో ప్రస్తుతం నడుస్తున్న గనులు మరో 15 ఏండ్లు కొనసాగుతాయని, సంస్థ కొనసాగాలంటే కొత్త గనులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు రిలీజ్  చేస్తే కొత్త గనుల ఏర్పాటుతో పాటు సంస్థకు అవసరమైన యంత్రాలు, ఇతర పని ముట్లు, సేఫ్టీ పరికరాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం గుర్తించిన గనులను వేలం ద్వారా ప్రైవేట్​కు ఇవ్వకుండా సింగరేణికి ఇవ్వాలని డిమాండ్  చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తాడిచర్ల–2, భూపాలపల్లిలో కేటీకే ఓసీ, కొత్తగూడెంలోని వీకే మైన్, శ్రావణ్ పల్లి మైన్, కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీలు ప్రారంభించాలని, దీంతో కార్మికులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో అధికారులు సంస్థ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. సంస్థ సొమ్మును కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్  చేశారు. ఏఐటీయూసీ లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కె.స్వామి, ఆరెల్లి పోశం, జీగురు రవీందర్, ప్రభుదాస్, మాదన మహేశ్, సంకె అశోక్, రంగు శ్రీనివాస్   పాల్గొన్నారు.