ఎయిర్​పోర్టుపై చిగురిస్తున్న ఆశలు

  • కొత్తగూడెంలో స్థల సేకరణ పనుల్లో ఆఫీసర్లు          
  • గరీబ్​పేట ప్రాంతంలో స్థల పరిశీలన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్​పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. మంగళవారం వరంగల్​లో జరిగిన బహిరంగ సభలో కొత్తగూడెంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొనడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎయిర్​ పోర్టు ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు దృష్టి సారించాయి. 

ఆరేండ్ల కిందట మొదలైంది..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోఎయిర్​ పోర్టు ఏర్పాటు చేయాలని ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సింగరేణి హెడ్డాఫీస్​, నవభారత్, కేటీపీఎస్​, హెవీ వాటర్​ ప్లాంట్, ఐటీసీ బీపీఎల్, ఎన్​ఎండీసీ లాంటి పలు పరిశ్రమలున్నాయి. పరిశ్రమలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్​పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆరేండ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిని కోరారు. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో రెవెన్యూ అధికారులు ల్యాండ్​ను పరిశీలించారు.

ల్యాండ్​కు సంబంధించిన వివరాలను ఎయిర్​ పోర్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లారు. పాల్వంచ మండలంలోని బంగారుజాల, పేట చెరువు పరిసర ప్రాంతాల్లో ఎయిర్​ పోర్టు అవసరమైన ల్యాండ్​ను ఆఫీసర్లు సెలెక్ట్​ చేశారు. ఎయిర్​ పోర్టు అథారిటీ వాళ్లు ల్యాండ్​ను పరిశీలించి వెళ్లారు. కానీ బీఆర్​ఎస్​ సర్కార్​ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎయిర్​ పోర్టు ఏర్పాటు ముచ్చట మూలకు పడింది.  ఇటీవల ఎయిర్​పోర్టు ఏర్పాటుపై జిల్లా మంత్రులతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా ఇన్​చార్జి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కేంద్రానికి లేఖ రాశారు.   

గరీబ్​ పేటలో స్థల​పరిశీలన..

ఎయిర్​ పోర్టు ఏర్పాటుకు కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల సరిహద్దు ప్రాంతంలోని గరీబ్​ పేట పరిసర ప్రాంతాల్లో ల్యాండ్​ను  ఇటీవల ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించారు. దాదాపు 600 నుంచి 900ఎకరాల వరకు ల్యాండ్​ ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 300 ఎకరాలు ఫారెస్ట్​ ల్యాండ్​, దాదాపు 300 నుంచి 400 ఎకరాలకు పైగా గవర్నమెంట్​ ల్యాండ్​ ఉన్నట్టుగా తెలిసింది. మరోసారి పూర్తి స్థాయిలో ల్యాండ్​పై సర్వే నిర్వహించనున్నారు. ల్యాండ్​ గుర్తించిన తర్వాత పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్​ పంపనుంది.

సీఎం ఇంట్రస్ట్.. మినిస్టర్ల ఫోకస్​

కొత్తగూడెంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుపై సీఎం రేవంత్​ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్​తో పాటు కొత్తగూడెంలో ఎయిర్​ పోర్టు ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖతో  చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. కొత్తగూడెంలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుపై జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  

ఎయిర్​పోర్టు ఏర్పాటుతో ఉపయోగాలు.. 

జిల్లాలో ఎయిర్​ పోర్టు ఏర్పాటుతో భద్రాచలంలోని సీతారామ చంద్ర స్వామి టెంపుల్​కు దేశ వ్యాప్తంగా భక్తులతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉంది. 

గోదావరి వరదల టైంలో హెలికాప్టర్లు ల్యాండ్​ అయ్యేందుకు సులువుగా ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ల ల్యాండింగ్​ కోసం కొత్తగూడెం, భద్రాచలంలోని క్రీడా మైదానాల్లో టెంపరరీ ఏర్పాట్లు చేస్తుండడంతోప్లే గ్రౌండ్స్​ దెబ్బతింటున్నాయని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మావోయిస్టుల ఏరివేతలో భాగంగా సైనిక హెలికాప్టర్లు తరుచూ జిల్లాకు వస్తుంటాయి. దీనికి ఉపయోగకరంగా ఉంటుంది.