హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరుగుతున్న మాట వాస్తవం. అయితే, ఢిల్లీ నగరంలో ఉన్నంత స్థాయిలో లేదని తెలంగాణా కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేకంగా ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం తక్కువే ఉన్నది అని ఈ ప్రకటన సారాంశం. అమెరికా లేదా ఇతర ప్రమాణాల మేరకు ఎక్కువే ఉంటుంది అని మాత్రం ఒప్పుకున్నది.
యూరప్, అమెరికా గాలి నాణ్యతా ప్రమాణాలు మనకు వర్తించవు అని తెలంగాణా కాలుష్య మండలి చెబుతున్నది. ప్రపంచమంతటా గాలి నాణ్యత పర్యవేక్షణ కేవలం కొన్ని పారామీటర్ల మీదనే ఉన్నది. మన దేశంలో కూడా అవే. కాకపోతే, వాటి ప్రమాణాలలో తేడా ఉన్నది. మన కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అమెరికా, యూరప్ ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, అవి మనకు వర్తించవు అంటున్నది ఎందువల్ల?
ఏక్యూఐ అనేది గాలి నాణ్యతను సూచించే అంకెల పోలిక. సంఖ్య ఎక్కువైతే గాలి నాణ్యత తక్కువ ఉన్నది. గాలి నాణ్యత అంకెలలోకి ఎట్లా మార్చారు అనేది కీలకం. కాగా, అసలు గాలి నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగిస్తున్న ప్రమాణాలు ఏమిటి అనేది ఆసక్తికరమైన విషయం. గాలిలో ప్రాణవాయువు ముఖ్యం. జీవాలు బతకాలంటే ప్రాణ వాయువు అవసరం. కానీ, గాలిలో ప్రాణవాయువుతో పాటు కలుషితాలు ఉండడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ప్రమాణాలలో ఆక్సిజన్ శాతం ఎంత అని అంచనాలు వేయరు.
మరి దానిని కొలవచ్చు కదా అంటే గాలిలో ప్రాణవాయువు స్థాయి సాధారణంగా తగ్గదు అని ఒకే ఒక కారణం మనకు కనపడుతుంది. గాలిలో ఇతర వాయువులు, సూక్ష్మ ధూళి రేణువుల శాతం పెరిగితే గాలి నాణ్యత తగ్గుతుంది. కాబట్టి వాటి స్థాయిని, సాంద్రతను మాత్రమే నిరంతరంగా కొలుస్తున్నారు. అయితే, ప్రాణవాయువు స్థాయి మారకుండా ఉండే అవకాశం లేదు. ఇతర వాయువులు ఉన్నప్పుడు, వాతావరణ పరిస్థితులనుబట్టి ఆక్సిజన్ ఇతరత్రా మిళితమై తగ్గవచ్చు. మొత్తానికి, ఆక్సిజన్ స్థాయిని బట్టి గాలి నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించడం లేదు. ఏక్యూఐలో ప్రాణవాయువు గురించి ప్రమాణాలు లేవు.
78% నైట్రోజన్, 21% ఆక్సిజన్
మన పరిసరాల గాలిలో సాధారణంగా 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్, హీలియం, మీథేన్, ఆర్గాన్, హైడ్రోజన్ కలయికతో అదనపు 1% ఉంటుంది. దీంట్లో అదనంగా వచ్చే వాయువులను కలుషితాలుగా పరిగణిస్తున్నారు. కలుషితాలు పరిసర గాలిలోకి ప్రవేశించినప్పుడు అవి ఆక్సిజన్‌ను, సాంద్రతను మార్చగలవు.
దేశవ్యాప్తంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మోనిటరింగ్( ఎన్ఏఎంపీ) కింద కేవలం 4 కలుషితాలను - పీఎం2.5, పీఎం10, ఎన్ఓ 2, ఎస్ఓ2 మాత్రమే నమోదు చేస్తారు. ఇతరత్రా కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ కూడా నమోదు చేస్తారు. పర్యవేక్షించడానికి అనేక కలుషితాలు ఉన్నా కూడా సులువుగా సాంద్రత నమోదు చేయవచ్చు అని ఏకైక కారణంతో వీటినే ఎంచుకున్నారు.
పోల్చి చూస్తే అత్యంత ప్రమాదకర కలుషితాల గురించి కాకుండా సులువుగా ‘పట్టుకునే’ వాటిని కొలిచి, నమోదు చేసి, గాలి నాణ్యతను నిర్ధారిస్తున్నారు. కలుషితాల నమోదు పరికరాలు, టెక్నాలజీలో పరిమితుల వలన కూడా ఇవే ఆరింటిని లెక్కిస్తారు. ఆయా ప్రాంతాలను బట్టి గాలిలోకి రకరకాల వాయువులు కలుస్తున్నాయి. అందులో ప్రమాదకరమైన బెంజీన్, అమ్మోనియా, ఫాస్జీన్, డయాక్సిన్లు, పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి.
గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది అని కేవలం 4 కలుషితాలను బట్టి చెబుతున్నారు. ఇతర వాయువులను నమోదు చేయడం లేదు కాబట్టి ఏక్యూఐ తక్కువ ఉన్నా గాలి కాలుష్యం తక్కువ ఉంది అని భావించే పరిస్థితి ఉండకపోవచ్చు.
ఊపిరితిత్తులు, గుండెపై కాలుష్య ప్రభావం
వాయు కాలుష్యం చేసే కలుషితాలలో అతిపెద్ద ముప్పు పీఎం 2.5 వల్ల వస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ భావిస్తున్నది. పీఎం 2.5 అంటే 2.5 మైక్రోమీటర్‌లకు సమానమైన లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన రేణువులు. దీనినే ప్రపంచవ్యాప్తంగా గాలి నాణ్యత ప్రమాణాలలో ప్రధానంగా గమనిస్తారు. పీల్చినప్పుడు, పీఎం 2.5 రక్తప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోయి గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి అనారోగ్య పరిణామాలకు కారణమవుతుంది.
అతి సూక్ష్మ రేణువులు (పీఎం2.5) కూడా రకరకాల పదార్థాల నుంచి వస్తున్నాయి. గాలిలో ఏ రకమైన పీఎం 2.5 రేణువులు ఉన్నాయి అని గుర్తించడం సాధ్యం కాదు. పీఎం 2.5 అనేది రసాయనాలు, పదార్థాలు, వాయువుల నుంచి వెలువడే వివిధ పరిమాణాలు, ఆకారాలు, కూర్పులతో కూడిన భిన్నమైన మిశ్రమం. వాటి ప్రభావం శరీరంలోకి ప్రవేశించాక కూడా భిన్నంగా ఉండవచ్చు.
హైదరాబాద్ చుట్టుపక్కల భారీ అంతస్తుల భవన నిర్మాణాలు అవుతున్నాయి. ఇండ్ల మధ్య కొత్త భవన నిర్మాణం, కూల్చివేతలు కూడా సూక్ష్మ రేణువులకు కారణం. పీఎం 2.5, పీఎం10, అంతకంటే తక్కువకాని, ఎక్కువ కాని రేణువుల మీద మన దగ్గర కొలిచే యంత్రాలు, పరికరాలు లేవు. ఇక నియంత్రణ గాలికి వదిలివేసినట్టే.
హైదరాబాద్‌లో 14 గాలి కాలుష్య నమోదు కేంద్రాలు
మన దేశవ్యాప్తంగా, జాతీయ గాలి కాలుష్య నమోదు కార్యక్రమంలో 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలలోని 344 నగరాలలో కేవలం 804 కేంద్రాలు ఉన్నాయి. ఇంత పెద్ద దేశంలో వేల పట్టణాలు, పదుల సంఖ్యలో నగరాలు ఉన్నా కూడా గాలి కాలుష్యం నమోదు విస్తృతంగా లేదు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రస్తుతం 14 గాలి కాలుష్య నమోదు కేంద్రాలు ఉన్నాయి. ఇంకొక 7 ఏర్పాటు చేస్తామంటున్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరుపై స్వయంగా పర్యావరణ శాఖా మంత్రి, తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. శీతాకాలంలో గాలి వీచదు కాబట్టి కలుషితాలు ఎక్కువ సమయం మనం పీల్చే వాతావరణంలో ఉంటాయి.
కాలుష్య నియంత్రణను విస్మరిస్తున్న ప్రభుత్వం
గాలి కాలుష్యానికి దోహదపడే 4 రంగాల గురించి, వాటిలో మార్పుల ద్వారా కలుషితాల నియంత్రణ గురించి ప్రభుత్వానికి ఒక సమగ్ర ఆలోచన లేదు. ఎందుకంటే, అవి ఆధునిక ఆర్థికాభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరుగుదలను అభివృద్ధిగా చూస్తున్న రాజకీయ దృక్పథం వాటి నియంత్రణను పట్టించుకోవడంలేదు. గాలి కాలుష్యం వల్ల అనేక సున్నితమైన జీవాలు, పక్షులు నశించిపోతున్నాయి.
ప్రపంచ జనాభాలో 99 శాతం మంది అపరిశుభ్రమైన గాలిని పీల్చుకుంటున్నారు అని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నా యి. వాయు కాలుష్యం వల్ల ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. ఎటువంటి కలుషితాలు గాలిలో కలుస్తున్నాయి. వాటి పరిమాణం ఎంత, ప్రాణుల మీద వాటి ప్రభావం ఎంత, వగైరా అంశాల మీద పరిశోధనలు ఏవి? మన శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్రం ఏమి చేస్తున్నది? పరిశుభ్రమైన గాలికోసం అందరూ కలిసికట్టుగా ఆలోచించాల్సిందే. గాలిని కలుషితం చేసే పనులు సమాజానికి చేటు తెచ్చేవిగా, అసాంఘిక పనులుగా, ప్రకృతి విధ్వంసకాలుగా ఎప్పుడు పరిగణిస్తామో అప్పుడే పర్యావరణ అనుకూల మార్పుకు నాంది ఏర్పడుతుంది.
- డా. దొంతి నర్సింహారెడ్డి-