వాయుసేన కొత్త చీఫ్గా అమర్​ ప్రీత్​ సింగ్

  • ఈ నెల 30న బాధ్యతలు చేపట్టనున్న ఎయిర్​ మార్షల్

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్​(ఐఏఎఫ్​) కొత్త చీఫ్​గా ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న రిటైర్ కానున్నారు. ఆయన పదవీవిరమణ తర్వాత ఆదే రోజు మధ్యాహ్నం భారత వాయుసేన కొత్త అధిపతిగా అమర్ ప్రీత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌‌గా పనిచేస్తున్న ఆయనకు 5 వేల గంటలకు పైగా ఫైటర్ ప్లేన్ నడిపిన అనుభవం ఉంది. అక్టోబర్ 27, 1964న జన్మించిన ఎయిర్ మార్షల్ సింగ్ డిసెంబర్ 1984లో భారత వాయుసేనలో ఫైటర్ పైలట్ గా ప్రవేశించారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్లో చదివారు. ఎయిర్ ఆఫీసర్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌‌స్ట్రక్టర్, మల్టిపుల్ ఫిక్స్‌‌డ్ అండ్ రోటరీ-వింగ్ ఎయిర్‌‌ క్రాఫ్ట్‌‌లలో టెస్ట్ పైలట్ గా ఎంతో అనుభవం ఉంది. కొత్త యుద్ధ విమానాల సేకరణ, నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్​ఏసీ) వెంట ఎయిర్ ఫోర్స్ ఆధునికీకరణ, గేమ్ చేంజర్​గా భావిస్తున్న ‘తరంగ్ శక్తి’ రూపకల్పనలో చాలా కీలక పాత్ర పోషించారు. మంచి వ్యూహకర్తగా పేరున్న సింగ్ తేజస్ జెట్‌‌ అభివృద్ధి ప్రాజెక్టులో విశిష్టమైన సేవలు అందించారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకాలు కూడా పొందారు.