లండన్ లో ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి

న్యూఢిల్లీ: లండన్ లోని ఓ హోటల్ లో ఎయిరిండియా మహిళా క్యాబిన్  సిబ్బంది ఒకరిపై దాడి జరిగింది. ఓ హోటల్  గదిలో ఉన్న ఆమెపై దుండగుడు ఒకడు గదిలోకి చొరబడి దాడి చేశాడు. ఆందోళనకు గురైన బాధితురాలు కేకలు వేయడంతో పక్క గదుల్లో ఉన్న సిబ్బంది వచ్చి ఆమెను రక్షించారు. లండన్  హీత్రో ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఒక స్టార్  హోటల్ లో వారం క్రితం ఈ ఘటన జరిగింది. అయితే, ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఒకరు తెలపగా.. భౌతిక దాడి అని మరో ఇద్దరు సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం స్వదేశానికి తిరిగివచ్చిన క్యాబిన్  సిబ్బందికి కౌన్సెలింగ్  ఇస్తున్నారు. 

ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హోటల్  గదిలో తమ సిబ్బంది ఒకరిపై జరిగిన దాడికి తీవ్రంగా చింతిస్తున్నామని, జరిగిన ఘటనపై లండన్  పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. దాడికి గురైన బాధితురాలికి, అలాగే ఇతర మహిళా సిబ్బందికి అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్  ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా.. తమ సిబ్బందిపై జరిగిన దాడిని ఎయిరిండియా ఉద్యోగులు ఖండించారు. విధి నిర్వహణలో తమ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్  చేశారు.