ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం

అత్యవసర ల్యాండింగ్ తో గురువారం రష్యాలోని  క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయం(KJA)లో  చిక్కుకుపోయిన  భారత ప్రయాణికులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి బయలుదేరింది. ఫ్లైట్ ఈ రోజు రాత్రి 8 గంటలకు రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని ఎయిర్‌లైన్ తెలిపింది. విమాన సర్వీసుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాకే ఎయిర్ ఇండియా  రిలీఫ్ ఫ్లైట్ ముంబై నుండి బయలుదేరిందని.. ఈ రోజు రాత్రి 8 గంటలకు అది రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని ఎయిర్‌లైన్ తెలిపింది.
KJAలోని ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించడానికి సరిపడా సిబ్బందితో పాటు భద్రతా సిబ్బందితో సహా ఎయిర్ ఇండియా బృందం విమానంలో ఉందని పేర్కొంది.  ప్రయాణికులందరికీ తగినంత ఆహారంతో పాటు అవసరమైన వస్తువులను తీసుకువెళుతున్నట్లు తెలిపింది. ఏదైనా సమాచారం కావాలంటే 011 - 69329301, USA - +13177390126 హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొంది.

కాగా గురువారం ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని  కార్గో హోల్డ్ సమస్య తలెత్తగా సిబ్బంది గుర్తించి విమానాన్ని రష్యాకు మళ్లించారు. అలా వెళ్లిన ప్రయాణికులకు రష్యన్ వీసాలు లేనందున వారిని అక్కడి అధికారులు టెర్మినల్ భవనంలోనే ఉంచారు. కాగా ఆ విమానంలో మొత్తం 225 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు.