అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం కెనడాకు దారి మళ్లింపు

బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాకు దారి మళ్లించినట్లు ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు.

"మంగళవారం(అక్టోబరు 15) ఢిల్లీ నుండి చికాగో వెళ్తున్న AI127 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయానికి దారి మళ్లించాం. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రయాణీకులకు సహాయం చేసేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది అందుబాటులో ఉన్నారు.." అని ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ పీటీఐకి తెలియజేసింది.

ALSO READ | డ్రోన్ యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయ్ : అమెరికాతో రూ.32 వేల కోట్ల డీల్

FlightRadar24 ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI127 ఢిల్లీ నుండి చికాగోకు తెల్లవారుజామున 3:00 గంటలకు (IST) బయలుదేరింది. ఉదయం 7:00 గంటలకు (US టైమ్) చికాగోలో ల్యాండ్ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి విమానం కెనడాలోని విమానాశ్రయంలోనే ఉంది. ఇంకా టేకాఫ్ కాలేదు.

అంతకుముందు అక్టోబర్ 10 న, ముంబై నుండి 239 మంది ప్రయాణికులతో న్యూయార్క్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ఎలాంటి వస్తువు కనుగొనబడలేదు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పదే పదే వెలుగు చూస్తున్నాయి.