గాల్లో ప్రాణాలు.. కెనడాలో వంకరగా ల్యాండ్ అయిన విమానం.. ఆ వెంటనే మంటలు

కెనడా: ఒకేరోజు ప్రపంచంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విమాన ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 181 మందిలో 179 దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే మరో రెండు ప్రమాద ఘటనలు వెలుగుచూశాయి. నార్వేలో 180 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న విమానం హైడ్రాలిక్ సిస్టమ్‎లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ల అప్రమత్తతతో సురక్షితంగా ల్యాండ్ అయింది. కెనడాలో కూడా విమాన ప్రమాదం జరిగింది.

కెనడాలోని హాలిఫ్యాక్స్ స్టాన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో PAL ఎయిర్ లైన్స్కు చెందిన Air Canada Flight 2259 విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రన్ వేపై విమానం స్కిడ్ అయిన కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో 20 డిగ్రీల కోణంలో విమానం రెక్క రన్ వే పేవ్మెంట్కు తగులుతూ ఫ్లైట్ దూసుకెళ్లింది. ఆ సమయంలో ఫ్లైట్ క్రాష్ అయినంత పెద్దగా భారీ శబ్దం వినిపించిందని ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఒకరైన నిక్కీ వాలంటైన్ మీడియాకు చెప్పారు.

విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో రన్ వేపై  ప్రాపర్గా లేవని తెలిపారు. విమానం బయటి భాగంలో మంటలు రేగడం ప్రయాణికులకు స్పష్టంగా కనిపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కొందరు ప్రయాణికులు విమానం విండోస్ నుంచి ఆ విజువల్స్ను మొబైల్స్లో రికార్డ్ చేశారు. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ టీం మిగిలిన వారిని సురక్షితంగా బయటకు చేర్చింది. మొత్తం ఈ విమానంలో 80 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

మంటలు అలుముకున్న రెండు నిమిషాల్లోనే ప్రయాణికులు విమానం నుంచి బయట పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం కూడా తగ్గింది. విమానం ఒకపక్క మొత్తంలో మంటల్లో కాలిపోయింది. ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, మిగిలిన ప్రయాణికులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. బయటపడిన ప్రయాణికులు ఈ ఘటనతో కొంతసేపు షాక్ కు గురయ్యారు తప్ప అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.