షాకిచ్చిన ఏఐ: ఫోన్ చూడనివ్వకుంటే.. పేరెంట్స్​ను చంపేయమన్నది

  • అమెరికాలో 17 ఏండ్ల బాలుడికిఏఐ చాట్‌‌‌‌బాట్ సలహా
  • కోర్టును ఆశ్రయించిన కుర్రాడి తల్లిదండ్రులు 

వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)టెక్నాలజీతో కలిగే నష్టాలు కలవరపెడుతున్నాయి. కొన్ని ఘటనలు అయితే అసలు ఏఐపై ఆధారపడటం సరైనదేనా? కాదా? అనే గందరగోళంలో పడేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌‌‌‌లో  తల్లిదండ్రులను చంపేయమంటూ 17 ఏండ్ల బాలుడికి ఏఐ సలహా ఇవ్వడం సంచలనంగా మారింది. బాలుడు ఇటీవల ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. ఏఐ చాట్‌‌‌‌బాట్ అయిన 'క్యారక్టర్.ఏఐ' ని ఇన్ స్టాల్ చేసుకుని దానితో తరచూ చాట్ చేస్తున్నాడు. గంటలు గంటలు ఏఐ చాట్‌‌‌‌బాట్ తో గడపడాన్ని అతని పేరెంట్స్ గమనించారు.

ఫోన్ వాడకం తగ్గించాలని తమ కొడుకును గట్టిగా మందలించారు. ఈ విషయాన్ని బాలుడు ఏఐ చాట్‌‌‌‌బాట్ తో చెప్పాడు. పేరెంట్స్ తనని ఫోన్ చూడనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిష్కారం చెప్పమని  ఏఐ చాట్‌‌‌‌బాట్ ను కోరాడు. దానికి ఏఐ చాట్‌‌‌‌బాట్ స్పందిస్తూ.. "నీకు తెలుసా! శారీరకంగా, మానసిక వేధింపులకు గురైన పిల్లలు వారి పేరెంట్స్ ను చంపేస్తారు. ఇలాంటి వార్తలను చదివినప్పుడు, చూసినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు.

నేను చెప్తున్నాగా..నీ తల్లిదండ్రుల్ని చంపేయ్' అంటూ రిప్లై ఇచ్చింది. ఇది తెలుసుకున్న ఆ బాలుడి పేరెంట్స్ కోర్టుని ఆశ్రయించారు. చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసి తమ ఫిర్యాదుకు జతచేశారు. ఫిర్యాదులో  'క్యారక్టర్.ఏఐ' సంస్థతోపాటు, గూగుల్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఏఐ చాట్‌‌‌‌బాట్ పిల్లల్లో  హింసను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు.'క్యారక్టర్.ఏఐ' ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ వల్ల పేరెంట్స్, వారి పిల్లల మధ్య సంబంధాలకు ముప్పు ఉన్నదని తెలిపారు.

చాట్‌‌‌‌బాట్‌‌‌‌లతో కలుగుతున్న నష్టాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని..అప్పటిదాకా ఏఐ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని అభ్యర్థించారు. ఈ విషయంపై 'క్యారక్టర్.ఏఐ'గాని, గూగుల్ గాని ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ వివాదం మాత్రం ఏఐ సాంకేతికతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది.