హైదరాబాద్​లో ఏఐ సెంటర్

  •      సీఎం రేవంత్ అమెరికా టూర్​లో ట్రైజిన్ టెక్నాలజీస్​తో ఒప్పందం 
  •     ఆర్సీసియం కంపెనీ ఏర్పాటుకూ కుదిరిన అగ్రిమెంట్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్ ఏర్పాటు చేసేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ట్రైజిన్ కంపెనీ ప్రకటించింది. 

వచ్చే మూడేండ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. మరో ఆరు నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పింది. ‘‘మా కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. మా కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది పని చేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది ఇండియాలోనే ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు వంద మంది పని చేస్తున్నారు” అని ట్రైజిన్ టెక్నాలజీస్ పేర్కొంది. కాగా, ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌‌‌‌లకు అవసరమైన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ సేవలు అందిస్తుంది. 

ఆర్సీసియం తొలి విదేశీ సెంటర్ హైదరాబాద్ లో.. 

టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్సీసియం అమెరికా తర్వాత తొలిసారి తెలంగాణలోనే తమ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది. సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.. ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో చర్చలు జరిపారు. 

అనంతరం హైదరాబాద్ లో తమ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్సీసియం ప్రతినిధులు ప్రకటించారు. ‘‘అమెరికా తర్వాత మేం విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా మా సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుంది. వచ్చే రెండేండ్లలో 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం” అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, డీఈ షా గ్రూప్, బ్లాక్‌‌‌‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ మద్దతుతో ఆర్సీసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు డేటా సంబంధిత సేవలు అందిస్తుంది. 

కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తాం: సీఎం

ఐటీ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్సీసియం కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్సీసియం ఏర్పాటుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలుస్తుందన్నారు. 

 టెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతున్నదని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ  వనరులు ఉండడంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నామని ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి తెలిపారు.