రైతులకు గుడ్ న్యూస్..త్వరలో రైతు భరోసా

  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • రేషన్ కార్డు లేని రైతులకు నెలాఖరున రుణమాఫీ:మంత్రి తుమ్మల
  • ఈ ఏడాది నుంచే పంటల బీమా అమలు.. జనవరి నుంచి రేషన్​లో సన్న బియ్యం
  • అధిక ఆదాయమిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచన
  • నల్గొండలో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: త్వరలోనే రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ.2 లక్షలపైన రుణమాఫీపై ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి నల్గొండలోని బత్తాయి మార్కెట్ యార్డులో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే రూ.31 వేల కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. గత ఐదేండ్లలో రైతులు బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్​ నిర్ణయం తీసుకున్నదన్నారు. అందులో భాగంగానే 22 లక్షల మంది తెల్ల కార్డులున్న రైతులకు ఇప్పటికే రూ.18 వేల కోట్లు మాఫీ చేసినట్టు చెప్పారు. రేషన్​ కార్డులు లేని మరో 4 లక్షల మంది రైతులకు ఈ నెలాఖరు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 

ఈ ఏడాది నుంచే పంటల బీమా అమలు చేస్తామని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కోటీ 50 లక్షల టన్నుల ధాన్యం పండనుందని, దేశానికే అన్నం పెట్టేలా మన రాష్ట్రం తయారు కానుందని తుమ్మల తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇందుకోసమే రైతులను ప్రోత్సహించేందుకు సన్న రకాలకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. 

ఎకరానికి ఏడాదికి రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. ఐదేండ్లలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్​లో పామాయిల్​ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండలో కూడా ఫ్యాక్టరీ పెడతామన్నారు. 

నల్గొండ జిల్లాలో 50 వేల ఎకరాల్లో బత్తాయి సాగు

నల్గొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండుతుందని ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఆరిన ధాన్యాన్ని కేంద్రానికి తెస్తే 24 గంటల్లో కొని డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతపురం తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా బత్తాయి సాగవుతుందని, సుమారు 50 వేల ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తారని తెలిపారు. ఎస్ ఎల్ బీసీ వద్ద గతంలో బత్తాయి కోసం నిర్మించిన షెడ్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని తుమ్మలను కోరారు. 

జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 152 కేంద్రాలు ప్రారంభించామన్నారు. బుధవారం నుంచి నల్గొండ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు  తెలిపారు. రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీసీ ఎమ్ ఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.