బీఆర్ఎస్ అసమర్థత వల్లే రూ.50 వేల కోట్ల బకాయిలు

  • గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు 
  • వరికి ప్రత్యామ్నాయంగాఆయిల్ పామ్ సాగు చేయాలి
  • రైతులను అడ్డం పెట్టుకొని విపక్షాలు పబ్బం గడుపుతున్నాయి     
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు

నల్గొండ, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్లే రూ.50 వేల కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని తెలిపారు. శుక్రవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

సన్నాల సాగుపై గత ప్రభుత్వానికి నిర్దిష్ట లక్ష్యం లేదన్నారు. అన్నిరంగాల్లో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తుందన్నారు. కొంతమంది అధికారం కోసం రైతులను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం రైతులకు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈసారి రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించామని చెప్పారు. ధాన్యంతోపాటు సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్​వన్​రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఆయిల్ పామ్ తోటల పెంపకం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రైతులు పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. రైతులు ఆయిల్ పామ్ తోటలు సాగుచేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంట్రాక్టర్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.  

 

కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలి..-

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు.  జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

నిధులు తీసుకొచ్చేందుకు కృషి..

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ ద్వారా సాధ్యమైనన్ని కేంద్ర నిధులను తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. సుమారు 92 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా జిల్లా  ప్రజలు లబ్ధిపొందేది చాలా తక్కువని చెప్పారు. కేంద్ర నిధుల వినియోగానికి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తామన్నారు. 

వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు..

కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో అమలు చేసి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో ఇబ్బందులు.. 

ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేల్​మంత్రులను కోరారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తే మిల్లర్లు తాలు, తేమ పేరుతో కోతలు పెడుతున్నారని, వాటిపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.  అనంతరంనల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాత్యాన్ని కొలిచే యంత్రాన్ని పరిశీలించారు.
 

కేసీఆర్ పాలనలో  40 కుటుంబాలే బాగుపడ్డాయి

నల్గొండ అర్బన్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్​తోపాటు 40 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్గొండలోని ఎన్జీ కళాశాలలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు చేస్తామని చెప్పి మాటను నిలబెట్టుకున్న గొప్ప త్యాగశీలి సోనియాగాంధీ అని కొనియాడారు.

పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని దుయ్యబట్టారు. రెండేండ్లలో ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.