పర్యాటక కేంద్రంగా ఖమ్మం ఖిల్లాను తీర్చిదిద్దాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం ఖిల్లాను రాష్ట్రానికే తలమానికంగా నిలిపేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్​లోని టూరిజం కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక అభివృద్ధి, నేలకొండపల్లి బౌద్ధ స్థూపం, భక్త రామదాసు ధ్యాన మందిరం, ఖమ్మం ఖిల్లాపై రోప్ వే పనుల పురోగతిపై రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్​రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్ రెడ్డితో మంత్రి తుమ్మల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లాపై రోప్ వే నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోప్ వే బ్రిడ్జి లోయర్ పాయింట్ లకారం పార్క్ వద్ద ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. లేని పక్షంలో ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ప్రత్యేక స్థలం పార్కింగ్ కేటాయించి, అక్కడి నుంచి బ్యాటరీ వాహనాల్లో రోప్ వే లోయర్ పాయింట్ కు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాకతీయుల కాలంనాటి ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా, అన్ని హంగులతో రూపురేఖలను మారుస్తున్నట్లు వెల్లడించారు. 

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆధ్యాత్మిక శోభకు నిలయంగా ఉందన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి చేపట్టాలని సూచించారు. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం ఖమ్మం జిల్లాకు మణిహారంగా నిలుస్తుందని చెప్పారు. ఖమ్మం ఖిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం నుంచే  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్​ తో ఫోన్​లో మాట్లాడారు. పలు పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక శాఖకు అవసరమైన భూమిని అప్పగించేలా రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుందరీకరణ పనులకు అవసరమైన నిధులను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేయాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్స్ సైతం ఇస్తానని మంత్రి పేర్కొన్నారు.