అన్నదాతకు ఏది దన్ను?

వ్యవసాయం నష్టాల ఊబిలో కూరుకుపోయిందనేది నిత్యం ప్రత్యక్షంగా కనిపించే నగ్నసత్యం.  ఈ నేపథ్యంలో  వ్యవసాయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడంలో సమయం, శక్తిని  పెట్టుబడిగా పెట్టడానికి రాబోయే తరం ఆసక్తి చూపదు.  గ్రామీణ యువత ఉన్నత చదువులు చదివి, పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి ఇతర నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలను ఆశిస్తున్నారు.

పొలాల్లో శ్రమిస్తున్న యువకులను  ప్రోత్సహించేందుకు రైతు సంఘాలు కూడా ఇష్టపడడం లేదు. ఇలా యువత వ్యవసాయానికి దూరంగా ఉండడం వెనుక సామాజిక, మానసిక, పరివర్తన ప్రధాన కారణం.  అలాగే మూడు ప్రధాన అంశాలు రైతుల పాలిట ప్రతికూలంగా మారాయి.  మొదటిది. పెరుగుతున్న ఇన్‌‌‌‌పుట్ ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. రెండోది. అస్థిరమైన రుతుపవనాలు, మార్కెట్.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా  ప్రమాదాలు పెరుగుతున్నాయి. దిగుబడి తగ్గుతోంది. ఇక మూడోది.  ధర. సేకరణ  ప్రతికూలంగా ఉన్నందున వ్యవసాయం నుంచి వచ్చే రాబడి క్షీణిస్తోంది.  ఆకలిని అధిగమించడానికి మనకు అవసరమైన పప్పుధాన్యాల వంటి పంటలను కూడా ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌పి)కి కొనుగోలు చేయడం లేదు.

రైతులు సంస్థాగత రుణాల రూపంలో రూ.12,60,000 కోట్ల ఆర్థికభారాన్ని ఎదుర్కొంటున్నారు. స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బు ఇందులో ఉండదు. పంటలు పండిన తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించాలని రైతులు ఆశిస్తున్నప్పటికీ, పంట నష్టం, తక్కువ ధర,  సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. భారతదేశంలో దాదాపు 150 మిలియన్ల మంది రైతులు వ్యవసాయం నుంచి వైదొలిగారు.

ప్రతిరోజూ దాదాపు 2,000 మంది  వ్యవసాయాన్ని వదులుకుంటున్నారని అంచనా.  ఇది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న 500,000 మంది రైతులకు అదనం. స్వామినాథన్ కమిటీ నివేదిక కూడా దేశంలోని దాదాపు 40 శాతం మంది రైతులు వ్యవసాయం నుంచి వ్యవసాయేతర కార్యకలాపాలకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. ఇదంతా చూస్తుంటే -భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అనే సామెత పాఠశాల పాఠ్యపుస్తకాల్లోనే నిజమనిపిస్తోంది.

ఉత్పత్తులకు ధర నిర్ణయించే అధికారం

రాజకీయ నాయకులు తమను కేవలం స్థానిక, జాతీయ ఎన్నికల సమయంలో మాత్రమే అవసరమయ్యే ఓటర్లుగా తగ్గించారని రైతులు గ్రహించారు. వారి ఆందోళనలు వ్యవసాయ సంఘాలకు సంబంధించిన సమస్యలు విస్మరణకు గురవుతున్నాయి.  రైతుకు తన వ్యవసాయ ఉత్పత్తులకు ధర నిర్ణయించే అధికారం లేదు.  ప్రతి రైతు తన పంటకు నిశ్చయమైన ఆదాయం, లాభదాయకమైన ధరను కోరుకుంటున్నాడు.

దానిని అందించడంలో అన్ని ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి.  వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడి తగ్గుతోంది.  ప్రస్తుతం దేశ జనాభాలో సగానికిపైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ  ఇది జాతీయస్థాయిలో 3 శాతం కంటే తక్కువ. దీంతో రైతులకు అందాల్సిన సహాయ సేవలు తగ్గిపోతున్నాయి. దేశంలోని మొత్తం రైతు జనాభాలో 85 శాతం చిన్న, సన్నకారు రైతులు గరిష్ట భారాన్ని భరిస్తున్నారు.  

యువతను వ్యవసాయం వైపుఆకర్షించే పథకాలు లేవు

రుతుపవనాలపై ఆధారపడిన వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది, ఎందుకంటే ఇది అధిక జనాభాకు ఆహారం, జీవనోపాధి భద్రతను అందిస్తుంది. ఏదేమైనా, వ్యవసాయం- వ్యవసాయ సమాజంపై వాతావరణ మార్పు ప్రభావాల పరంగా భారత ఉపఖండం అత్యంత హాని కలిగించే ప్రాంతాలలో ఒకటి. వ్యవసాయ సమాజంలోని అసంతృప్తి మొండిగా సాగుతూనే ఉంది.  ఉత్పత్తి ప్రమాదాలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్న మార్కెట్ అనిశ్చితి కారణంగా సంక్షోభం కాలక్రమేణా పెరుగుతోంది.  

వ్యవసాయ వ్యాపార రంగం ఇంకా ప్రారంభదశలోనే ఉంది.   వినియోగదారుల రూపాయిలో  రైతుల వాటాను పెంచడానికి అవరోధంగా ఉంది. వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌లో అవకాశం ఉన్నప్పటికీ యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఎలాంటి పథకం లేదు.  ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాతావరణాన్ని తట్టుకోగల పంట రకాలు - పశువుల జాతుల అభివృద్ధిపై మళ్లీ దృష్టి సారించింది. 

వ్యవసాయ భూమిలో కాలుష్యం

వ్యవసాయం,  ఆహార పంటలకు ఉపయోగించే భూమిలో  దాదాపు 64 శాతం.. పురుగుమందుల కాలుష్య ప్రమాదంలో ఉంది.  వీటిలో దాదాపు మూడింట ఒక వంతు ప్రాంతాలు అధిక ప్రమాదంలో ఉన్నాయని 168 దేశాలలో వ్యవసాయ భూమిపై ప్రపంచ అధ్యయనం వెల్లడించింది.  చైనా, జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కాలుష్యం ఎక్కువగా ఉంది.  కాలుష్యం ఉన్న  అతిపెద్ద భూభాగాలు ఆసియాలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో కొన్ని 'ఫుడ్ బౌల్' దేశాలుగా పరిగణిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో అధిక భాగాన్ని ఈ భూభాగాలు పోషిస్తున్నాయి.  కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారు మాత్రం దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పురుగు మందు డబ్బాలపై ఉండే దానికి విక్రయించే ధరకు పొంతన ఉండడం లేదు. బయోకెమికల్స్‌‌‌‌, ఫర్టిలైజర్స్‌‌‌‌ ధరలు రైతులకు తెలియవు. దీన్ని అవకాశంగా చేసుకొని వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు.

రైతు పెట్టే పెట్టుబడులలో ఎరువులు, పురుగుమందులకు సింహభాగం ఖర్చు చేస్తుండగా అవే నకిలీ, కల్తీ  వ్యాపారుల పాలుకావడం వారి పుట్టిముంచుతోంది.  మ్యూరేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పొటాష్‌‌‌‌ (ఎంవోపీ)లో ఎక్కువ కల్తీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే యూరియా బస్తాలో నత్రజని 23శాతం ఉండాలి. కానీ కల్తీ కారణంగా అది తగ్గిపోతోంది.  అనేక చోట్ల రైతులు కూడా తాము కొనుగోలు చేసిన ఎరువుల బస్తాల్లో కల్తీ జరుగుతుందని చెప్తున్నారు.  రైతు ప్రయోజనాలను కాపాడటంలో వ్యవసాయశాఖ ఎప్పుడు అప్రమత్తంగా ముందుండాలి.  రైతులు ఎరువులు లేదా పురుగుమందులు కొన్న వెంటనే వ్యాపారుల నుంచి బిల్లులను  తీసుకోవాలి.  

రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలి

రైతుల ఆర్థిక భద్రతకు సౌర, పవన శక్తి,  పంటల బీమా,  రైతు సంక్షేమ పథకాలు చాలా అవసరం.- వాతావరణ అనిశ్చితి సందర్భంలో  రైతులకు  నూతన భద్రతా వలయాలు కల్పించాలి. అయితే, వాతావరణ- స్మార్ట్ గ్రామాలను సృష్టించడంతోపాటు, ఆచరణలు, సేవలు   వివిధ మంత్రిత్వ శాఖల పథకాల కలయికను నిర్ధారించడం ద్వారా ఈ ప్రయత్నాలను బలోపేతం చేయాలి.  హర్యానా,  బిహార్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే  ఆ దిశగా అడుగులు వేశాయి.  అదేవిధంగా సబ్సిడీ పథకాలను పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

పర్యావరణ వ్యవస్థ సేవలకు చెల్లించడానికి సబ్సిడీ పెట్టుబడులను ఉపయోగించుకోవాలి.  ఇది రైతులు తమ ఉత్పత్తి, ఆదాయాన్ని  పెంచుకునేందుకు దోహదపడుతుంది.  వాతావరణ ప్రమాదాలను తగ్గించడానికి, సాంకేతికత సేవలను ఉపయోగించమని ప్రోత్సహించడమే కాకుండా, పారిస్ ఒప్పందం ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌‌‌‌ను నిరోధించడం ద్వారా ఉద్దేశించిన జాతీయంగా నిర్ణయించిన  (Intended Nationally Determined Contributions  INDC) సహకారానికి దోహదం చేస్తుంది. అందువల్ల, వ్యవసాయ సమాజాన్ని ప్రభావితం చేసే పర్యావరణ,  సాంకేతిక, సామాజిక, ఆర్థిక కారకాలను మెరుగుపరచడానికి వాతావరణ మార్పు సవాలును పరిష్కరించడానికి వాస్తవిక మూల్యాంకనం కీలకం. 

‌‌‌‌‌‌‌‌- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి.