యాసంగి ప్రణాళిక ఖరారు .. వరి ఎక్కువగా సాగయ్యే చాన్స్

  • విత్తనాలు, ఎరువులు రెడీ చేస్తున్న వ్యవసాయ శాఖ

గద్వాల, వెలుగు: వానాకాలం పంట ముగుస్తుండడంతో యాసంగి పంట ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈసారి జిల్లాలో 1,29,068 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈసారి యాసంగిలో వరి పంట ఎక్కువగా సాగయ్యే చాన్స్  ఉంది. యాసంగికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు రెడీ చేస్తున్నారు. వానాకాలంలో పంట దిగుబడి అంతంతమాత్రంగానే రావడంతో రైతులు యాసంగిపై దృష్టి పెడుతున్నారు. చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడం, బోరు బావులు ఉన్న రైతులు పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

వరి సాగు వైపే మొగ్గు..

ఈసారి యాసంగిలో 60, 256 ఎకరాల్లో వరి, 3,402 ఎకరాల్లో సజ్జలు, 19,272 ఎకరాల్లో మొక్కజొన్న, 5,200 ఎకరాల్లో పొగాకు, 12,850 ఎకరాల్లో వేరుశనగ, 13,731 ఎకరాల్లో శనగ, 5,203 ఎకరాల్లో మినుములు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు యాసంగి పంట ప్రణాళికను ఖరారు చేశారు.

ఎరువులు, విత్తనాలపై క్లారిటీ..

యాసంగిలో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలపై కూడా అగ్రికల్చర్ శాఖ ఒక క్లారిటీకి వచ్చింది. 15,066 క్వింటాళ్ల వరి, 136 క్వింటాళ్ల సజ్జలు, 1,927 క్వింటాళ్ల మొక్కజొన్న, 3,432 క్వింటాళ్ల శనగ, 416 క్వింటాళ్ల మినుములతో పాటు ఇతర విత్తనాలు రైతులకు అవసరం అవుతుందని గుర్తించారు. వీటితో పాటు యూరియా 10,220 మెట్రిక్  టన్నులు, డీఏపీ 4,790 మెట్రిక్  టన్నులు, కాంప్లెక్స్  ఎరువులు 14,890 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1,850 మెట్రిక్  టన్నులు, ఎఫ్ఎస్పీ 1,750 మెట్రిక్  టన్నులు అవసరం కానున్నాయి.

వనపర్తిలోనూ వరి సాగే..!

వనపర్తి: వనపర్తి జిల్లాలో యాసంగి పంట ప్రణాళికను వ్యవసాయ అధికారులు ఖరారు చేశారు. 1,73,980 ఎకరాల్లో ఎక్కువ శాతం వరి ఉండడం గమనార్హం. సాధారణంగా రబీలో సాగునీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ, జిల్లాలో ఆరుతడి పంటలతో పాటు వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఖరీఫ్​ కోతలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా అన్ని వనరుల కింద కోతలు పూర్తి కానున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు ఉండడంతో భూగర్భ జలాలు బాగా ఉన్నాయి. అయితే ఇరిగేషన్​ ఆఫీసర్లు మాత్రం ఫిబ్రవరిలోగా కోతకొచ్చేలా ఆరుతడి పంటలు సాగు చేయాలని, ఆ తరువాత సాగు నీరు అందదని పేర్కొంటున్నా రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపుతున్నారు. 

దీంతో సాగునీటి వనరులున్న మండలాల్లో ఇప్పటి నుంచే రబీ పంటల సాగు ప్రారంభమైంది. ఈ సారి ఖరీఫ్​లో కంటే రబీలో వేరుశనగ పంట విస్తీర్ణం పెరగనుంది. 19 వేల ఎకరాల్లో పల్లీ సాగు చేయనున్నారు. ఖరీఫ్​లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో చాలా చోట్ల పంట దెబ్బతింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి 30 శాతం తగ్గింది. వేరుశనగలో తాలు శాతం ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు లోనయ్యారు. వరి 1,38,500 ఎకరాలు, వేరుశనగ 19 వేల ఎకరాలు, మినుములు 14 వేల ఎకరాలు, మొక్కజొన్న 700 ఎకరాలు, శనగలు 550 ఎకరాలు, జొన్నలు 500 ఎకరాలు, చెరకు, ఆముదాలు, ఉలవలు, పొగాకు, రాగులు, కందులు తదితర పంటలు 730 ఎకరాల్లో సాగు చేయనున్నారు.

విత్తనాలు, ఎరువులకు కొరత లేదు..

ఈసారి యాసంగికి రైతులు ముందుస్తుగా రెడీ అవుతున్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు రెడీ చేస్తున్నాం. వానాకాలంలో పంట దిగుబడి తగ్గిన మాట వాస్తవమే. ఈ సారి బోరు బావులతో పాటు కుంటలు చెరువుల కింద కూడా యాసంగిలో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.

సక్రియా నాయక్, డీఏవో, గద్వాల