పోటీ పరీక్ష ఏదైనా గానీ.. ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్ నుంచి పక్కా ప్రశ్నలు

సహకార మార్కెటింగ్​

రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్​ సంఘాలుగా ఏర్పడి తమ వస్తువులను విక్రయించుకునే విధానమే సహకార మార్కెట్​. 1912లో రుణేతర రంగాల్లో కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి చట్టం చేయడంతో కర్నాటకలో తొలి సహకార మార్కెటింగ్​ సంఘం 1915లో ప్రారంభమైంది. 1954కు ముందు వరకూ సహకార మార్కెటింగ్​ సంఘాలు ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేసేవి. 1954 తర్వాత విడివిడిగా కాకుండా రుణాలు, మార్కెటింగ్​ కార్యకలాపాలను రెండింటినీ ఒకే సహకార సంఘం నిర్వహించేలా బహుళార్థక సహకార సంఘాలుగా పనిచేయడం ప్రారంభించాయి. 

ప్రయోజనాలు
బేరమాడే శక్తి: రైతులు బేరమాడే శక్తిని పెంచుతాయి.
కొనుగోలుదారునితో ప్రత్యక్ష సంబంధం: మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనేవారికే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఫలితంగా సరైన ధరను రాబట్టుకోవచ్చు. 
రుణ సదుపాయం: తక్కువ వడ్డీకి రుణాలను సంస్థాగత మార్గాల్లో పొందవచ్చు. 
సులభ, చౌక రవాణా: పెద్ద మొత్తంలో రవాణా చేయడం వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.
గ్రేడింగ్​, ప్రామాణీకరణ: సహకార సంస్థల ద్వారా గ్రేడింగ్​, ప్రామాణీకరణ సదుపాయాలు పొందవచ్చు. 
మార్కెట్​ సమాచారం: మార్కెట్​ సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.
మార్కెట్​ ధరలు: మార్కెట్​ ధరలనూ ప్రభావితం చేయవచ్చు.
ఉత్పాదకాలు, వినియోగ వస్తువులు: ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక  మందులు తదితర ఉత్పదకాలను తక్కువ ధరకు నాణ్యమైనవి పొందవచ్చు. 
వ్యవసాయ ఉత్పత్తుల ప్రక్రియ: వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్​ ప్రక్రియనూ చేపట్టవచ్చు. 

భారతదేశంలో సహకార మార్కెటింగ్​ ప్రగతి

రైతులు సహకార మార్కెటింగ్​ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తమ మిగులు ఉత్పత్తులను సంఘానికి విక్రయిస్తారు. సంఘం వారికి కొంత అడ్వాన్స్​ ఇస్తుంది. సంఘం సేకరించిన ఉత్పత్తులను టోకు వ్యాపారులకు నేరుగా విక్రయిస్తుంది. అవసరమైతే గిడ్డంగుల్లో కొంతకాలం నిల్వ చేస్తుంది. విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అడ్వాన్స్​ పోగా రైతులకు చెల్లిస్తుంది. సహకార మార్కెటింగ్​ నిర్మాణం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది రెండంచెల విధానం. ఇందులో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక సంఘాలు, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సహకార మార్కెట్​ సంఘం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మూడంచెల్లో ఉంది. మధ్యలో జిల్లా కేంద్ర మార్కెటింగ్​  సంఘాలు కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో రెండంచెల్లో ఈ నిర్మాణం ఉంది. 

నేషనల్​ కో–ఆపరేటివ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ 

1963లో పార్లమెంట్​ చట్టం ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. వ్యవసాయ వస్తువుల ప్రాసెసింగ్​, నిల్వ, గ్రేడింగ్​, మార్కెటింగ్​ కోసం ప్రణాళికలు రూపొందింస్తుంది. సహకార మార్కెటింగ్​ ప్రాసెసింగ్​ అభివృద్ధికి విత్త సహాయం, సలహాలు అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. సహకార రంగంలో వివిధ రకాల సహకార వ్యవసాయ ప్రాసెసింగ్​ సొసైటీలు పనిచేస్తున్నాయి. చక్కెర పరిశ్రమలో అధిక శాతం సహకారం రంగంలో పనిచేస్తున్నాయి. 

నేషనల్ అగ్రికల్చరల్​ కో-ఆపరేటివ్ మార్కెటింగ్​ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​
సహకార మార్కెటింగ్​ వ్యవస్థలో ఇది అత్యున్నత సంస్థ. ఇది 1958, అక్టోబర్​ 2న నెలకొల్పారు. ఎంపిక చేసిన వ్యవసాయ వస్తువుల సేకరణ, పంపిణీ, ఎగుమతి, దిగుమతులను నిర్వహించే అతి పెద్ద సంస్థ ఇది. పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, అల్లం, మిరియాలు మొదలైన వస్తువులను నాఫెడ్​ ఎగుమతి చేస్తుంది. నిత్యావసర వస్తువులను దేశంలో మిగులు ప్రాంతాల నుంచి కొరత కలిగిన ప్రాంతాలకు బదిలీ చేస్తుంది.  

ట్రైఫెడ్​

ఇది 1987లో ప్రారంభమైంది. గిరిజనుల అటవీ, వ్యవసాయోత్పత్తులను ప్రైవేట్​ వ్యాపారస్తుల నుంచి రక్షించేందుకు దీన్ని స్థాపించారు. వరి, గోధుమ సేకరణలో ఎఫ్​సీఐకి ఇది ఏజెన్సీగా పనిచేస్తుంది. 

భారత వ్యవసాయ మార్కెటింగ్​ రకాలు

ప్రాథమిక మార్కెట్లు: వారంలో ఒక నిర్ణీత రోజున వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను గ్రామ సంతలో విక్రయిస్తారు. విక్రయం కాగల మిగుల్లో 50 శాతం ఇక్కడే విక్రయం అవుతుంది. వీటిని దక్షిణాది రాష్ట్రాల్లో షాండీలు అని ఉత్తరాదిన హాట్​, బజార్​లను అంటారు. 

ద్వితీయ మార్కెట్లు: వీటిని టోకు లేదా అసెంబ్లింగ్​ మార్కెట్లు అంటారు. మండీలు ఈ రూపంలోకి వస్తాయి. గ్రామాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ సంవత్సరం పొడవునా ఈ మార్కెట్​లో వ్యాపారం జరుగుతుంది. ఉత్పత్తి నిల్వ, బ్యాంకింగ్​ వసతులు కూడా ఇక్కడ ఉంటాయి. 

అంతిమ మార్కెట్లు: పెద్ద పట్టణాలు, నగరాల్లో ఇవి ఉంటాయి. వీటి పరిధి ఒక రాష్ట్రం అంతకంటే ఎక్కువ ప్రాంతానికి విస్తరించవచ్చు. అంతిమంగా వినియోగదారునికి వస్తువులు చేర్చడం, వ్యవసాయ ముడిపదార్థాలు ప్రొసెసింగ్​ యూనిట్లకు చేర్చడం ఇందులో భాగమే. 

సంతలు: ప్రముఖ యాత్రా స్థలాల్లో, పండుగ దినాల్లో వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి సంతలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పశువులు విక్రయం జరుగుతుంది. 

సహకార మార్కెటింగ్​: సహకార సూత్రాల ప్రాతిపదికన రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకోవడానికి ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ మార్కెటింగ్​ సమస్యలకు ఇది ఉత్తమమైన పరిష్కారం.

విక్రయం కాగల మిగులు: రైతులు పండించిన పంటలో స్వయం వినియోగానికీ విత్తనాలకూ పోగా మార్కెట్​లో అమ్మడానికి సద్ధంగా ఉన్న ఉత్పత్తిని విక్రయం కాగల మిగులు అంటారు. భారత్​ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయం కాగల మిగులు తక్కువగా ఉంటుంది. 

జాతీయ మార్కెట్​ అభివృద్ధి

వ్యవసాయ ఉత్పత్తులకు ఈ–ప్లాట్​ఫాం ద్వారా దేశవ్యాప్తంగా ఒక మార్కెట్​ను అందించాలని వ్యవసాయ విభాగం వారు భావించారు. అగ్రి టెక్​ ఇన్​ఫ్రాస్టక్చర్​ ఫండ్​ ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెట్​ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంది. 
2016–17 బడ్జెట్​లో ఆర్థిక మంత్రి ఈ–మార్కెట్​ ప్లాట్​ఫాంను 585 రెగ్యులేటెడ్​ మార్కెట్లలో ప్రవేశపెట్టాలని ప్రకటించారు.

గిడ్డంగి సదుపాయాలు
పంట చేతికి వచ్చిన వెంటనే విక్రయించుకోవాల్సిన అవసరం లేకుండా గిడ్డంగి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వీటివల్ల రైతులు బేరమాడే శక్తి పెరుగుతుంది. గిడ్డంగిలో ఉంచిన ఉత్పత్తుల రసీదును బట్టి పరపతి సదుపాయం పొందవచ్చు. 1954లో గ్రామీణ పరపతి సర్వే కమిటీ వారు మూడు అంచెల్లో గిడ్డంగుల సదుపాయం ఉండాలన్నారు. అవి.. జాతీయస్థాయి, రాష్ట్ర, జిల్లా స్థాయి, గ్రామాల స్థాయి.  ఇందుకు అనుగుణంగా కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ)ను 1957లో ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు రాష్ట్ర గిడ్డంగి సంస్థలను ఏర్పాటు చేశాయి. 1965లో జాతీయస్థాయిలో ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా ఏర్పడింది. 783.17 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నిల్వ చేసే సామర్థ్యం కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది. ఆరో ప్రణాళికలో గ్రామాల్లో గిడ్డంగులు నిర్మించడానికి ఒక కేంద్ర ప్రతిపాదిత పథకం ప్రారంభించారు.

క్రమబద్ధమైన మార్కెట్లు
రైతులు వ్యాపారుల అక్రమ పద్ధతుల వల్ల మోసపోకుండా తమ పంటలను సరైన ధరలకు విక్రయించుకోవడానికి క్రమబద్ధమైన మార్కెట్లు ఉపయోగపడతాయి. వ్యవసాయ మార్కెటింగ్​లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు 1951లో రెగ్యులేటెడ్​ మార్కెట్లు ఏర్పడ్డాయి. తూనికలు, కొలతలు కొలిచినందుకు ఇచ్చే చార్జీలు క్రమబద్ధీకరించడం, అనధికార వసూళ్లు నిరోధించడం, సరైన సమాచారాన్ని రైతులకు అందించడం మొదలైన పనులు చేపడతాయి. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్​ కమిటీ చట్టాల ప్రకారం వివిధ రాష్ట్రాలు రెగ్యులేటెడ్​ మార్కెట్లను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7320 రెగ్యెలేటెడ్​ మార్కెట్లు ఉన్నాయి. కేరళ, మణిపూర్​ తదితర రాష్ట్రాలు ఏపీఎంసీ చట్టాలను తీసుకురాలేదు.