బంగ్లాదేశ్‌లో ఊచకోత.. అవామీ లీగ్ నేతలు,హిందువులే లక్ష్యంగా దాడులు

  • హసీనా పార్టీకి చెందిన 29 మంది లీడర్ల సజీవ దహనం 
  • హిందువులనూ వెంటాడి చంపిన మూకలు
  • మైనార్టీల ఇండ్లు, దుకాణాలు, ఆలయాలు లూటీ
  • హింస ఆపండి: మహ్మద్ యూనస్, ఖలీదా జియా పిలుపు
  • నేడు కొలువుదీరనున్న తాత్కాలిక ప్రభుత్వం 
  • ప్రభుత్వాధినేతగా ప్రమాణం చేయనున్న యూనస్

ఢాకా:  బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కారు కూలిన తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్ కు చెందిన నేతలను అల్లరిమూకలు ఊచకోత కోశాయి. హిందువుల ఇండ్లు, టెంపుల్స్ పైనా దాడులకు పాల్పడి లూటీ చేశాయి. అవామీ లీగ్ చెందిన కొందరు నేతలను దుండగులు సజీవ దహనం చేశారు. మరికొందరిని రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. కొన్ని చోట్ల డెడ్​బాడీలను ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు వేలాడదీశారు.

 హిందువుల ఇండ్లు, దుకాణాలను దోచుకున్నారు. ఆలయాలను ధ్వంసంచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 29 మంది అవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్​బాడీలను ఆర్మీ గుర్తించింది. సాత్ఖిరా ప్రాంతంలో 10 మంది, కొమిల్లాలో 11 మంది అవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు. 

ఆ పార్టీకి చెందిన నేతల ఇండ్లపై మూకదాడికి పాల్పడ్డారు. కొమిల్లాలోని అశోక్తలాలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు టీనేజర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవదహనమయ్యారు. నటోరె ప్రాంతంలో ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటిపై మూక దాడికి దిగి నిప్పుపెట్టారు. ఆ ఇంట్లోని గదులు, బాల్కనీలు, టెర్రస్​పై నలుగురు డెడ్​బాడీలను ఆర్మీ గుర్తించింది. దేశవ్యాప్తంగా అవామీ లీగ్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.  

హుండీలు పగులగొట్టి దోపిడీ 

హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లిన తర్వాత మొదలైన దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. రెండ్రోజుల్లో సుమారు 97 ప్రాంతాల్లో  హిందువుల ఇండ్లు, షాపులపై దాడులు చేశారు. అందినకాడికి దోచుకున్నారు. 10 టెంపుల్స్ ధ్వంసం చేసి బంగారం, వెండి లూటీ చేశారు. హుండీలు పగులగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. కొన్ని చోట్ల వెండి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తున్నది. దక్షిణ బాగర్‌‌‌‌‌‌‌‌హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. హిందువులపై దాడుల నేపథ్యంలో చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు.   

కర్ఫ్యూ పెట్టాలన్న హసీనాకు నో చెప్పిన ఆర్మీ

షేక్ హసీనా సోమవారం బంగ్లాదేశ్ విడిచి పారిపోయారు. అయితే, ముందు రోజు ఆదివారం రాత్రి ఆమె ఆఫీసులో కీలక పరిణామాలు జరిగినట్టు వెల్లడైంది. ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్ జమాన్ హెడ్ క్వార్టర్స్​లో తన జనరల్స్​తో ముందుగా భేటీ అయ్యాడు. 

దేశవ్యాప్తంగా ఎక్కడా కర్ఫ్యూ పెట్టొద్దని, నిరసనకారులపై కాల్పులు జరపొద్దని ఆదేశించాడు. తర్వాత ఆయన ప్రధాని షేక్ హసీనా ఆఫీస్​కు వెళ్లాడు. కర్ఫ్యూ విధించాలని హసీనా ఆదేశించినా పట్టించుకోలేదు. ఆమె ఆర్మీ ఉన్నతాధికారులతో ఆన్​లైన్ మీటింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఆ మరుసటి రోజు సోమవారం మధ్యాహ్నం 45 నిమిషాల టైం ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోవాలని ఆర్మీ చీఫ్ ఆదేశించడంతో ఆమెకు గత్యంతరం లేక రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. 

 ముజిబుర్ బయోపిక్ నటుడి హత్య 

బంగ్లాదేశ్ జాతిపిత, హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ లో నటించిన యువ నటుడిని, దర్శకుడైన అతడి తండ్రిని కూడా నిరసనకారులు కొట్టి చంపేశారు.  రెహమాన్‌‌‌‌‌‌‌‌ జీవితం ఆధారంగా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన దర్శక, నిర్మాత సలీమ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 2021లో ఓ సినిమాను తెరకెక్కించారు. ‘తుంగి పరార్‌‌‌‌‌‌‌‌ మియా భాయ్‌‌‌‌‌‌‌‌’ టైటిల్ తో రూపొందించిన ఈ సినిమాలో రెహమాన్ యుక్త వయసు పాత్రను సలీమ్ కొడుకు, నటుడు శాంతో ఖాన్ పోషించాడు. హసీనా గద్దెదిగిన వెంటనే అల్లరిమూకలు శాంతో, సలీమ్ ను  లక్ష్యంగా చేసుకున్నారు. తండ్రీకొడుకులు తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆలోపే నిరసనకారులు చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపేశారు.  

బ్యాంకు తెరవగానే లూటీకి యత్నం

ఢాకాలో బుధవారం ఉదయం కొన్ని బ్యాంకులు తెరవగానే పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వచ్చి ఆందోళన చేపట్టారు. కొందరు బ్యాంకు లూటీకి ప్రయత్నించారు. వీరికి బ్యాంకు అధికారులే సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కాజీ సయ్యదుర్ రెహ్మాన్​తో పాటు ఆరుగురు ఉన్నత స్థాయి అధికారులు తమ పోస్టులకు రాజీనామా చేశారు. అటార్నీ జనరల్ అడ్వకేట్ అబు మహ్మద్ అమిన్ ఉద్దీన్ కూడా రిజైన్ చేశారు. 

కాగా, పలు ఫ్యాక్టరీలపై కూడా నిరసనకారులు దాడులు చేయగా.. ప్రొడక్షన్ ఆగిపోయింది. బుధవారం కొన్ని గార్మెంట్ యూనిట్స్ మాత్రం తెరుచుకున్నాయి. మరోవైపు ఢాకాలోని కొన్ని ప్రాంతాల్లో  ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు వలంటీర్లు రంగంలోకి దిగారు. రోడ్లపై ఉన్న టైర్లు, గ్లాసులు, కర్రలు తొలగిస్తున్నారు.  కాగా, దేశవ్యాప్తంగా తమపై జరిగిన దాడులకు నిరసనగా రెండ్రోజులుగా సమ్మె చేస్తున్న పోలీసులు డ్యూటీలో చేరాలని అడిషనల్ ఐజీ ఏకేఎం రెహ్మాన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ సేఫ్టీ ముఖ్యమని, లా అండ్ ఆర్డర్​ను అదుపులోకి తేవాలని కోరారు. 

నేడు యూనస్ ప్రమాణ స్వీకారం  

బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక సర్కారు కొలువుదీరనున్నట్టు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. గురువారం రాత్రి 8 గంటలకు ప్రభుత్వ అధినేత(చీఫ్ అడ్వైజర్)గా యూనస్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. 15 మందితో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని, దీనికి యూనస్ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. 

కాగా, యూనస్ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌‌‌‌‌‌‌‌లో 1940లో జన్మించారు. మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కలిగించారు. ఆయన సేవలను గుర్తించిన నోబెల్ అకాడమీ 2006లో శాంతి బహుమతితో గౌరవించింది. 

హింసను వెంటనే ఆపండి: ఖలీదా జియా పిలుపు 

బంగ్లాదేశ్ లో వెంటనే మైనార్టీలపై దాడులను ఆపాలని ఆందోళనకారులకు మాజీ ప్రధాని ఖలీదా జియా పిలుపునిచ్చారు. అన్ని మతాలను గౌరవించాలని కోరారు. గృహ నిర్బంధం నుంచి మంగళవారం విడుదలైన ఆమె బుధవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నియంతృత్వ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. మనం ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ ను నిర్మించుకుందాం. అన్ని మతాలను గౌరవించాలి. ప్రతీకారం, విద్వేషం లేని బంగ్లా మనకు కావాలి” అని ఆమె తెలిపారు. కాగా, దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆర్మీతో పాటు పోలీసు అధికారులను మహ్మద్ యూనస్ కోరారు. 

ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ప్రజలకు సూచించారు. అయితే, అవామీ లీగ్ పార్టీ నేతల ఊచకోతపై షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై, ఆలయాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ‘‘మా పార్టీకి చెందిన 29 మంది లీడర్లను చంపేశారు. ఎంపీల ఇండ్లు తగులబెట్టారు. హిందువులపై కూడా దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ లోని మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిందిగా ఇండియన్ గవర్నమెంట్​కు రిక్వెస్ట్ చేస్తున్న’’ అని ఆయన తెలిపారు.