కారు దిగుతున్న నేతలు.. ఓటమితో కామారెడ్డి జిల్లాలో వర్గపోరు తీవ్రస్థాయికి..

  • అయోమయంలో కార్యకర్తలు 
  • బీఆర్ఎస్​ మున్సిపల్ చైర్​పర్సన్​పై  అవిశ్వాసం నోటీస్​ 

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అంతర్గత విభేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో బీఆర్​ఎస్​ నాయకుల మధ్య వర్గపోరు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్ సీరియస్​ అయ్యారు. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. 

అయినా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. పార్లమెంట్​ఎన్నికల్లోనైనా తమ ఉనికి చాటుకోవాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. జహీరాబాద్​ ఎంపీ బీబీపాటిల్​బీజేపీలో  చేరారు.  ఒక్కో లీడర్ పార్టీని వీడుతుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల కామారెడ్డి నియోజకవర్గ  విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం​నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి హాజరయ్యారు.  కేటీఆర్​ సమక్షంలో పార్టీ నాయకులు దూషించుకోవడంతో సమావేశం రసాభాసగా సాగింది. నాయకుల మధ్య విభేదాలు బయటపడడంతో పార్టీ శ్రేణులు అమోమయానికి గురయ్యారు. 

ఇన్​చార్జిపై ఇంకా స్పష్టతరాలే..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గ బీఆర్ఎస్​ ఇన్​చార్జి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  పలువురు ముఖ్య నాయకులతో  కో –ఆర్డినేషన్​కమిటీ వేశారు. ఈ కమిటీపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​కు ఇన్​చార్జి బాధ్యతలను అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్​చేశారు. కార్యకర్తల మీటింగ్ కంటే ముందు సమన్వయ కమిటీ సభ్యులతో కేటీఆర్​భేటీ అయ్యారు.  పార్లమెంట్​ఎన్నికల్లో కూడా కో –ఆర్డినేషన్​ కమిటీని కంటిన్యూ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.  గంప గోవర్ధన్​ నాయకత్వంలోనే  సమన్వయ కమిటీ పనిచేస్తుందని కేటీఆర్​ పేర్కొన్నారు.  

మున్సిపల్ ​చైర్​పర్సన్ పై అవిశ్వాసం నోటీస్..

కామారెడ్డి మున్సిపల్​చైర్​పర్సన్​నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్​ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.   పలువురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కూడా పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారు. ఇంకా కొందరు కౌన్సిలర్లతో పాటు  నాయకులు బీఆర్ఎస్​ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.