ఏఈవోల సహాయ నిరాకరణ

  • డిజిటల్ క్రాప్​సర్వేకు దూరం
  • 'డీసీఎస్' యాప్​ఇన్​స్టాల్ చేసుకోనందుకు రెండ్రోజులు ఆబ్సెంట్​ ​​ 
  • సిబ్బంది కొరతతో డిజిటల్ సర్వేకు అడ్డంకులు
  • లక్షల ఎకరాల్లో సర్వే ఎలా చేయాలంటున్న ఏఈవోలు
  • ఇప్పటికే కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చిన వైనం

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు :  ప్రభుత్వం చేపట్టబోయే 'డిజిటల్​క్రాప్​సర్వే'పై ఏఈవోలు సహాయ నిరాకరణకు సిద్ధమయ్యారు. సర్వే కోసం ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ఆందోళనలు నిర్వహించడానికి రెడీగా ఉన్నారు. పంటల సాగు పక్కాగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 'డిజిటల్​క్రాప్​సర్వే' చేపట్టడానికి రెండేండ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే కొనసాగుతుండగా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే తాజాగా డిజిటల్ క్రాప్​సర్వే నిర్వహించాలని అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఇటీవల ఏఈవోలకు ట్రైనింగ్​ఇచ్చారు. ఈ నెల 24 నుంచి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే తమతో 49 రకాల పనులు చేయిస్తున్నారని ఏఈవోలు అంటున్నారు. తాజాగా డీసీఎస్​అప్పగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమతో ఈ సర్వే సాధ్యం కాదని చెబుతున్నారు. అదనంగా స్టాఫ్​ నియమిస్తేనే సర్వే చేయగలమని, లేదంటే సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్లు, డీఏవోలకు ఏఈవోలు వినతిపత్రాలు అందించారు.  

రెండు రోజులు అబ్సెంట్..​

డీసీఎస్​ విషయంలో అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​కచ్చితంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఆదేశించినందున సర్వే  చేయాల్సిందేనని చెబుతూ డీసీఎస్ యాప్​ను రిలీజ్ చేసి ఇన్​స్టాల్​చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఏఈవోలు మాత్రం సర్వే చేయడం సాధ్యం కాదని చెబుతూ యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోలేదు. దీంతో ఈ నెల 27,28 తేదీల్లో అందరికీ ఆబ్సెంట్​వేశారని ఏఈవోలు చెబుతున్నారు. ఈ రెండు రోజులు తాము డ్యూటీ చేసినా ఆబ్సెంట్​వేసి కాజువల్​లీవ్​గా తీసుకున్నట్టుగా రికార్ట్ చేశారని చెబుతున్నారు. సర్వే విషయంలో మరింత ఒత్తిడి తెస్తే పూర్తిస్థాయిలో సహాయ నిరాకరణ చేయడానికి వెనుకాడబోమని ఏఈవోలు తెలిపారు. 

నేడు చర్చలు..

డీసీఎస్​విషయంలో అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​కచ్చితంగా వ్యవహరిస్తుంటే అదే స్థాయిలో ఏఈవోలు పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. జేఏసీగా ఏర్పాటై కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో జేఏసీల బాధ్యులతో అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​సోమవారం చర్చలు నిర్వహించనుంది. చర్చల అనంతరం తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏఈవోలు చెబుతున్నారు. 

లక్షల ఎకరాల్లో సర్వే..

యాదాద్రి జిల్లాలో సాగుకు అనువైన భూమి 6 లక్షల ఎకరాలకుపైగా ఉంది. అయితే 4.50 లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి సహా వివిధ పంటలను సాగు చేస్తున్నారు. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ జిల్లాను 92 క్లస్టర్లుగా విభజించి ఏఈవోలను నియమించింది. సూర్యాపేట జిల్లాలో 82 క్లస్టర్లు ఉండగా, 287 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 82 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. వీరి పరిధిలో సుమారు 6,69 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఒక్కో గ్రామంలో వందల నుంచి వేల సంఖ్యలో సర్వే నంబర్లు ఉన్నాయి. డీసీఎస్​ సర్వే బాధ్యత ఏఈవోలకు అప్పజెపితే ఒక్కొక్కరు 5 వేల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంటుంది.  

ఒక్క మండలంలోనే మూడు నెలలు..

డిజిటల్ క్రాప్​సర్వేకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే ఆదేశాలు వచ్చినా అప్పటి సర్కారు అమలు చేయలేదు. అయితే పలు జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్​గా తీసుకొని ఏఈవోల ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో అప్పట్లో సర్వే చేశారు. ఆ ఒక్క మండలంలో సర్వే చేయడానికే దాదాపు 20 మంది ఏఈవోలు రంగంలోకి దిగినా పూర్తి కావడానికి మూడు నెలల టైం పట్టింది.

ఇప్పుడు ప్రతి మండలంలో సర్వే నిర్వహించాల్సి ఉన్నందున అదనంగా స్టాఫ్​ను తీసుకుంటేనే సర్వే సాధ్యమవుతుందని ఏఈవోలు అంటున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ప్రతి వెయ్యి ఎకరాలకు విలేజ్​అగ్రికల్చర్ అసిస్టెంట్​(వీఏఏ)లను రిక్రూట్​చేసుకున్నారని తెలిపారు. అక్కడి మాదిరిగానే తెలంగాణలో కూడా వీఏఏలను రిక్రూట్​చేసుకోవాలని ఏఈవోలు డిమాండ్​ చేస్తున్నారు.