ఉపాధి, విద్య, వైద్యంపై..  చెంచుల ఆందోళన బాట

నాగర్​కర్నూల్, వెలుగు : తమకు కనీస వసతులు కల్పించాలన్న డిమాండ్​తో నల్లమలలోని చెంచుపెంటలు ఏకమవుతున్నాయి. అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ నుంచి చెంచు పెంటలను ఖాళీ చేయించి చెంచులను తరలించే స్కీమ్​ మొదలుకుని విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం అడవిబిడ్డలు గొంతెతుత్తున్నారు.

ఉపాధి కరువు..

చెంచులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించాల్సి ఉండగా.. మారిన నిబంధనలతో ఉపాధి హామీ ఆఫీస్​కు శాశ్వతంగా తాళం పడింది.  కేవలం చెంచుల అభివృద్ది కోసం మన్ననూర్​లో ఏర్పాటు చేసిన ఐటీడీఏ అసలు ఉందా? లేదా? అన్న విధంగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన్ననూర్​ ఐటీడీఏ ఆఫీస్​ వన్​ మ్యాన్​ ఆర్మీగా మారిపోయింది. ఔట్​ సోర్సింగ్​ సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నారు. చెంచులకు వైద్యం అందించడం కోసం ఏర్పాటైన మొబైల్​ యూనిట్​ మూతపడింది. దాతలు ఇచ్చిన అంబులెన్స్​ ఆఫీస్​ చెట్ల కింద పెట్టేశారు.​

చెంచుల అభివృద్ది కోసం కేటాయించే నిధులను ఖర్చు చేసేందుకు అన్ని కీలక శాఖల నుంచి సిబ్బందిని డిప్యూట్​ చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఉపాధి, ఇతర ప్రధానమైన శాఖలకు సిబ్బంది లేరు. ఒక సీనియర్​ అసిస్టెంట్, ముగ్గురు ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది పని చేస్తుండగా ఈ మధ్య ఏపీవోను బదిలీపై పంపించారు. ఆమె ఐటీడీఏ, డీటీడబ్ల్యూవోగా పని చేయాలన్న ఆదేశాలు గందరగోళంగా మారాయి. ఇక కలెక్టర్లు మారిన ప్రతిసారీ ఐటీడీఏ ఇన్​చార్జి పీవోలను మారుస్తున్నారు.

పదేండ్లుగా పట్టించుకోలే..

నల్లమలలో పీసా,1/70 చట్టాలు అమలు చేయాలని చెంచులు గట్టిగా పట్టుబడుతున్నారు. అడవిలో ఉన్న చెంచులను నాగరిక ప్రపంచంలోకి తరలించాలనే ప్రయత్నాలు బాగానే ఉన్నా.. అడవిలో ఉన్నంత వరకైనా తమకు దక్కాల్సిన పథకాలను అమలు చేయాలన్న డిమాండ్​ పెరుగుతోంది. పూర్తి స్థాయిలో ఐటీడీఏ ఆఫీస్​ను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

గత ప్రభుత్వంలో పదేండ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తమకు కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ఉందని చెబుతున్న చెంచులు, తమ బాధలను చెప్పుకోవడానికి ఇటీవల మన్ననూర్​ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. లా అండ్​ ఆర్డర్​ సమస్య వస్తుందని పోలీసులు చలో అసెంబ్లీని అడ్డుకున్నారు.

డిమాండ్లివే..

    చెంచు యువతకు చిన్నచిన్న ఉద్యోగాలు ఇవ్వకుండా.. జనరల్​ కోటాలో పోటీపడి సాధించుకోవాలని చెప్పడంతో అన్యాయం జరుగుతుందని అంటున్నారు.
    ఆర్వోఎఫ్ఆర్​ పట్టాలతో ఎలాంటి ఉపయోగం లేదని, బ్యాంకు రుణాలు, రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా వర్తించడం లేదని వాపోతున్నారు. 
     కొల్లాపూర్​ మండలంలోని చెంచుల భూములు పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్​లో ముంపునకు గురైతే పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. గైరాన్​ పట్టాలకు సైతం పరిహారం చెల్లించిన గత ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని వాపోతున్నారు. 
    ఏజెన్సీ ఏరియాలోని ఆశ్రమ, గిరిజన పాఠశాలలను ఐటీడీఏ పరిధిలో చేర్చి సీఆర్టీ, నాల్గో తరగతి ఉద్యోగాలు స్థానిక చెంచులకు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఏటీఆర్, నల్లమలలో టైగర్​ ట్రాకర్స్, వాచర్స్​గా పని చేస్తున్న చెంచులను రెగ్యులరైజ్​ చేసి అసిస్టెంట్​ బీట్​ ఆఫీసర్లు, బీట్​ ఆఫీసర్లుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
    అటవీ ఉత్పత్తుల సేకరణపై చెంచులకు హక్కు కల్పిస్తూ గిట్టుబాటు ధర, మార్కెటింగ్​ సౌలతులు కల్పించాలని, ప్రాసెసింగ్​ యూనిట్లు పెట్టాలని కోరుతున్నారు. 
     లింగాల మండలం అప్పాపూర్​ గ్రామ పంచాయితీ పరిధిలోని చెంచు పెంటల నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు 100 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని, తమను అమ్రాబాద్​ మండలంలో కలపాలని కోరుతున్నారు.

ఫండ్స్​ రావడం లేదు..

చెంచుల స్కీములు, నిధుల గురించి ఎలాంటి సమాచారం లేదు. చెంచుల అభివృద్ధి, సంక్షేమానికి పదేండ్ల నుంచి ఎలాంటి ఫండ్స్​ రాలేదు. పూర్తి స్థాయి అధికారులు, సిబ్బంది లేక ఔట్​ సోర్సింగ్​ సిబ్బందితో ఆఫీస్​ నడిపిస్తున్నాం.

– జాఫర్, సీనియర్​ అసిస్టెంట్, ఐటీడీఏ