భారీ ప్రాజెక్టులకు మోక్షమేది?

  • ఆదిలాబాద్​లో ఎయిర్​పోర్టుకు మొండి చేయి
  • ముందుకుపడని ఆర్మూర్ రైల్వేలైన్ పనులు
  • సిమెంట్ ఫ్యాక్టరీపై నోరు మెదపని నేతలు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టులకు మోక్షం కలగడం లేదు. అన్ని అర్హతలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. ఎయిర్ పోర్టు, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్మూర్ రైల్వే లైన్, టెక్స్ టైల్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే పత్తి ఆధారిత జిన్నింగ్ మిల్లులు మూత పడ్డాయి. ఒకప్పుడు వందకు పైగా ఉన్న కాటన్ పరిశ్రమలు ఇప్పుడు 20 వరకు చేరుకున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ 30 ఏండ్లుగా తెరుచుకోవడం లేదు. 

తాజాగా వరంగల్ జిల్లా మమునూర్​లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఆదిలాబాద్ కు మాత్రం మొండి చేయి చూపింది. ఎన్నో ఏండ్లుగా జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తూనే ఉంది.

ఎన్ని వినతులు ఇచ్చినా.. 

ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ గత ఆగస్టు నెలలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి వినతి పత్రం అందించారు. గతంలోనూ పలుమార్లు మాజీ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇక్కడ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలను కలిసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇక్కడ ఎయిర్ పోర్టుకు సంబంధించి రక్షణ శాఖ భూములు 369 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. 2014లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. 

ఇందుకోసం దాదాపు 2 వేల ఎకరాలను అధికారులు గుర్తించి, కేంద్రానికి నివేదిక పంపించారు. అయితే, అప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో ఏర్పాటు ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎయిర్ పోర్టు ఏర్పాటు అంశం ఆయా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతోంది తప్పితే అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. 

శిథిలావస్థలోకి సిమెంట్ ఫ్యాక్టరీ..

ఒకప్పుడు రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రానికి ఆనుకొని లాండసాంగ్వి గ్రామ శివారులో రూ. 60 కోట్లతో దీనిని స్థాపించారు. 1982 ఆగస్టు 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎండీ తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 1991 వరకు సిమెంట్ ఉత్పత్తి చేస్తూ దేశంలోని నలుమూలలకు సరఫరా చేశారు. 

1991లో కేంద్రంలో పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. దీంతో 1991,1992,1993లో మూడేండ్లపాటు వేల కోట్ల లాభాలు గడించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లేవీ పద్ధతిని (60 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయడం ) రద్దు చేయడంతో సీసీఐకి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. 

దీంతో 1993 అక్టోబర్ లో సీసీఐ లో సిమెంట్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఫలితంగా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు భారీ దెబ్బతగిలింది. గత 30 ఏండ్లుగా సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ వినిపిస్తూనే ఉంది.  874 ఎకరాల్లో విస్తరించి ఉన్న సీసీఐకి మరో వందేళ్ల పాటు తరగని సున్నపురాయి అందుబాటులో ఉంది. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఆర్మూర్ రైల్వే లైన్​పై ఆపసోపాలు

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజల 25 ఏండ్ల కల ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్. 2017లో ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1200 కోట్లతో 145 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో సగం వాటా భరించేందుకు రాష్ట్రం ముందుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రైల్వే పనులు చేపట్టాలని ఒప్పందం కదుర్చుకున్నారు. ఆ తర్వాత పనులు చేపట్టడంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. 

దీంతో ప్రతి ఏటా దీని అంచనా వ్యయం పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం రూ. 2 వేల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ లైన్ పై ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. సర్వే పనులు పూర్తైనప్పటికీ పనులు ప్రారంభించడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతోనే రైల్వే లైన్ కు మోక్షం కలగడం లేదని తెలుస్తోంది.