కొత్తగా 30 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం : ఉత్తమ్

  • బీఆర్ఎస్ హయాంలోని ఇరిగేషన్ లోపాలు సరిచేస్తున్నం: ఉత్తమ్
  • మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్ట్, లెండీ ప్రాజెక్టు పూర్తి చేస్తం
  • గ్లోబల్ టెక్నాలజీతో ఎస్సారెస్పీ పూడిక తీస్తం
  • నిజాం సాగర్ ​నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి

నిజామాబాద్​/కామారెడ్డి, వెలుగు:  వచ్చే ఐదేండ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇందుకోసం ఈ బడ్జెట్​లో రూ.22,500 కోట్లు కేటాయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన సాగునీటి రంగాన్ని సరిచేస్తూ ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్సీ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నీరు లేకుండానే రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి సాధించామన్నారు.

80 టీఎంసీలకు తగ్గిన ఎస్సారెస్పీ

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామని ఉత్తమ్​ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నాగమడుగు లిఫ్టు, లెండి ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల కిందున్న కెనాల్స్, స్లూయిస్, షట్టర్ల రిపేర్ యుద్ధప్రాతిపాదికన చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్లలో పాలనలో ఇరిగేషన్ ను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం తమ ప్రభుత్వం వచ్చాక 700 మంది ఏఈఈలను అపాయింట్ చేశామన్నారు. కెనాల్స్ వద్ద 1,800 లస్కర్​లను నియమించామన్నారు. టీఎస్పీఎస్పీ ద్వారా  1,300 మంది ఉద్యోగులను నియమిస్తామని చెప్పారు.

ఐదేండ్ల పాటు సన్నాలకు బోనస్​

ఐదేండ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్​కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని మంత్రి చెప్పారు. దొడ్డు బియ్యంకు దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పడిపోతుందని, సన్నాలను ప్రొత్సహించేందుకు బోనస్ ఇస్తున్నామన్నారు. యాసంగిలో సన్నాలకు బోనస్ ఉండదని సోషల్​మీడియాలో ప్రచారం జరుగుతున్నదని, అది నిజం కాదన్నారు. ఆయన శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. కొత్త రేషన్ కార్డుల పక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. త్వరలో రేషన్​కార్డులపై సన్నబియ్యం ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పక్రియ షూరు అయ్యిందని.. నెల రోజుల్లోనే అద్భుతమైన ప్రగతి చూడబోతున్నారని తెలిపారు.

నిన్న మొన్న కట్టిన  డ్యామ్ కూలిపోతున్నది

వందేండ్ల కింద కట్టిన నిజాంసాగర్ చెక్కుచెదరకుండా ఉందని, రాష్ట్రంలో నిన్న మొన్న కట్టిన డ్యామ్​ కూలిపోతున్నదని ఉత్తమ్​ ఎద్దేవా చేశారు. ఇట్లాఎందుకైతుందో ఆ ప్రాజెక్టును కట్టిన బీఆర్ఎస్ చెప్పాలని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 ఏండ్ల పాలనలో 1లక్షా 81 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్​పై ఖర్చు పెట్టినా రాష్ట్రంలో కొత్త ఆయకట్టు రాలేదన్నారు. తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.