కరీంనగర్ జిల్లాలో తుదిదశకు సమగ్ర కుటుంబ సర్వే

  • 3,34,227 కుటుంబాల్లో సర్వే పూర్తి
  • 98 శాతం పూర్తయినట్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడి 

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కరీంనగర్ జిల్లాలో తుది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దశకు చేరుకుంది. కలెక్టర్ పమేలా సత్పతి ప్రతి రోజు సర్వేను పర్యవేక్షిస్తున్నారని, మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అడిషనల్ కలెక్టర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రఫుల్ దేశాయ్ ఆదివారం వెల్లడించారు. 

అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. సర్వే వివరాలను నమోదు చేసేందుకు మున్సిపల్, తహసీల్, ఎంపీడీవో ఆఫీసుల్లో ఏర్పాట్లు చేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వేలో సేకరించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. సర్వే చేసిన సిబ్బంది సైతం ఆన్ లైన్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారన్నారు.  సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా సేకరించడంతోపాటు ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ తెలిపారు. డేటా ఎంట్రీ ముగిసిన వెంటనే ప్రభుత్వానికి సర్వే నివేదిక సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
3,34,227 కుటుంబాల సర్వే.. 

జిల్లాలో తొలుత స్టిక్కరింగ్ సమయంలో 3,29,280 కుటుంబాలను గుర్తించినప్పటికీ.. సర్వే చేస్తుండగా మరో 5 వేలకుపైగా కుటుంబాలు రికార్డుల్లో నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,34,227 కుటుంబాల్లో సర్వే పూర్తయింది.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు కొత్తపల్లి, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీల్లో 1,21,320 కుటుంబాల్లో సర్వే చేయగా.. జిల్లాలోని 15 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 2,12,957 కుటుంబాల్లో సర్వే పూర్తయింది.

 ఈ సర్వేలో 2,864 మంది ఎన్యుమరేటర్లు, 287 మంది సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు, 20 మంది స్పెషల్ ఆఫీసర్లు  పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 98 శాతం సర్వే పూర్తి కాగా, రెండు, మూడు రోజుల్లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వే కంప్లీట్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

 ప్రముఖుల ఇండ్లలో సర్వే 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఇండ్లలో ఆదివారం సర్వే చేశారు.  ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు కుటుంబసభ్యులు సమాధానమిచ్చారు.