ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  ప్రతిపాదనలు సమర్పించాలి

  • అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్, వెలుగు : వానకాలం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో  వానకాలం ధాన్యానికి కనీస మద్దతు ధర నిర్వహణపై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లావ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తూర్పార బట్టే యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం మిల్లర్లతో సీఎంఆర్ పై సమీక్షించారు. పెండింగ్ సీఎంఆర్ ను త్వరగా చెల్లించాలన్నారు. సమావేశంలో డీఎస్ వో వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డీఎం హరీశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.