రుణమాఫీపై రైతులను దగా చేసింది కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కాదా?:అద్దంకి దయాకర్‌

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే హామీల అమలు ఏమైందంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు.ఈ తొందర..మీరు అధికారంలో ఉన్న పదేండ్లలో ఏమైంది?  మీరు  అధికారంలో ఉన్న పది  సంవత్సరాల్లో  ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు?  దళితులకు 3 ఎకరాలు,  గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు 12% కు పెంచుతామని చెప్పి ఆ హామీని గాలికి వదిలేశారు. 3 లక్షల డబుల్‌‌‌‌‌‌‌‌  బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని  2,92,057 ఇండ్లను మంజూరు చేసి, తొమ్మిదిన్నరేండ్లు గడిచిపోయినా  కేవలం 23 వేల ఇండ్లు మాత్రమే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. 

రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి.  నాలుగేండ్లు  కాలక్షేపం చేసిన అనంతరం  మార్చి 2022న  91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అట్టహాసంగా ప్రకటించారు.  ప్రశ్నపత్రాల లీకేజీలతో  నిర్వహించిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో సంవత్సరాల తరబడి కోచింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకొన్న విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.  ఇదేగాక, నిరుద్యోగ  భృతి  రూ.3,016 ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు.  ఒక్క నిరుద్యోగికి  కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన  పాపాన పోలేదు.  

31 లక్షల రైతుల రుణమాఫీకి ఎగనామం

అధికారంలోకి  వస్తే  లక్ష  రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని 2018 ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి  రూ.25వేల చొప్పున 4 సంవత్సరాల్లో మొత్తం లక్ష రూపాయలు రుణమాఫీ  చేస్తానని  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. అప్పటికి  రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ.25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించింది. దీనితో 36.68లక్షల మంది రైతులకు రూ. 20,141 కోట్లు మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. వీటికి ప్రతి సంవత్సరం  బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  రుణమాఫీకి  నిధులు కేటాయించడం,  రైతులకు మొండిచేయి చూపడం జరిగింది.  నాలుగేండ్ల కాలంలో  రూ.20,164 కోట్లు  రుణమాఫీకి  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కేటాయించింది.  కానీ, రైతులకు చెల్లించింది  మాత్రం  రూ.1206 కోట్లు మాత్రమే. నాలుగు సంవత్సరాల కాలంలో 5.66 లక్షల మందికి రుణమాఫీ పూర్తి కాగా, ఇంకా 31.02లక్షల మందికి పెండింగ్​లో పెట్టారు.   

రైతులను పీడించిన బ్యాంకులు

ఇదిగో,  అదిగో అంటూ  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం  రుణమాఫీ  చేయకపోవటంతో  రైతులు నానా కష్టాలు ఎదుర్కొన్నారు.  పెద్దపల్లి  జిల్లా  కాలువ  శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌  మండలం ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ అధికారులు 164 మంది రైతులకు  లీగల్‌‌‌‌‌‌‌‌  నోటీసులు జారీ చేశారు.  రుణమాఫీ  చేయకపోవటంతో రైతుల అకౌంట్లను  ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌ చేసి  రైతుబంధు పైసలను వడ్డీల కింద బ్యాంకర్లు  జమ చేసుకున్నారు.  ఇవేకాక, 2023లో వానాకాలం వడ్లు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే, పౌరసరఫరాల సంస్థ వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ఆ సొమ్మును రైతుల బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. దీంతో పంటల సాగుకు సొమ్ములేక రైతులు నానా అవస్థలు పడ్డారు. రైతు రుణమాఫీ సంవత్సరాల తరబడి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం ఆలస్యం చేయడంతో  బ్యాంకులు ఆగ్రహించి వారికి తోచిన మార్గాలలో రైతులను  పీడించి వసూళ్లు చేసుకున్నారు. 

  రైతులను  డీఫాల్టర్ల  జాబితాలో చేర్చిన బ్యాంకులు

 పశుసంవర్ధకశాఖ  గొర్రె ల పంపిణీకి  గొల్ల  కురుమల  బ్యాంకు ఖాతాల్లో  నేరుగా నగదు బదిలీ చేసింది.  మునుగోడు నియోజకవర్గంలోని 469 మంది  గొల్ల కురుమల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి లక్షా 58వేల చొప్పున జమ చేశారు. ఈ సొమ్మును రైతు రుణాల కింద బ్యాంకులు జమ చేసుకొని గొర్రెలు కొన్నా డబ్బులు ఇచ్చేది లేదని బ్యాంకులు చెప్పాయి. వృద్ధులకు ఇచ్చిన ఆసరా పెన్షన్లను సైతం బ్యాంకులు రుణమాఫీ కింద జమ చేసుకున్నాయి. రుణమాఫీ కాక 2023 జులైలో  బ్యాంకర్లు 20లక్షల మంది  రైతులను  డీఫాల్టర్ల  జాబితాలో చేర్చారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం  గత ఎన్నికల్లో  రైతులకు ఇచ్చిన  రుణమాఫీ హామీ వెంటనే అమలు చేయాలని లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ గత సంవత్సరం  ఫిబ్రవరిలో  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌  జిల్లా  తలమడుగులో  రైతులు తహశీల్దార్‌‌‌‌‌‌‌‌  కార్యాలయం ఎదుట నిరసన  చేశారు. 2023, మార్చి 2న వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా పెద్దేముల్‌‌‌‌‌‌‌‌ మండలం గొట్టిపల్లిలో వడ్డే మక్తలయ్య ఇంటికి బ్యాంకు అధికారులు వెళ్లి అప్పు చెల్లించాలంటూ ఆ రైతుకు నోటీసులిచ్చారు.  బ్యాంకు అధికారులు ఇంటికి తాళం వెయ్యమంటారా?  లేక  గొర్రెలు, మేకలు ఏమైనా ఉంటే అమ్మి కట్టాలని ఇంటి ముందు తిష్టవేశారు.  ఈ పరిణామాలన్నింటికి ఎవరు కారణమో కేసీఆర్​ చెప్పాలి.

రైతుల ఆస్తుల జప్తు

గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోపు తెలంగాణలోని 6.37లక్షల మంది రైతుల ఖాతాలను బ్యాంకులు నిరర్ధక ఆస్తులు ( నాన్‌‌‌‌‌‌‌‌ ఫర్ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌ అసెట్స్‌‌‌‌‌‌‌‌)గా  నమోదు చేశాయి.  ఈ జాబి తాలోని  రైతుల  ఆస్తుల  జప్తుతోపాటు  మళ్లీ  కొత్తగా రుణాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో  రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో  మొత్తం 75,61,395  రైతు ఖాతాలుండగా.. 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌  వరకు అందులో 6,37,694  మంది రైతుల ఖాతాలను ఎన్‌‌‌‌‌‌‌‌పీఏగా నమోదు చేసినట్లు బ్యాంకులు వెల్లడించాయి.  ఈ రైతుల నుంచి అసలు, వడ్డీ కలిపి  రూ.7,050 కోట్ల మేర వసూలు కావాల్సి ఉందని బ్యాంకులు తెలిపాయి.  

సాధారణ రుణాల్లో 3 కిస్తీలు చెల్లించని వారిని ఎన్‌‌‌‌‌‌‌‌పీఏగా బ్యాంకులు ప్రకటించి వారి ఆస్తులను జప్తు చేస్తాయి.  గత నెల 24వ తేదీన  కేటీఆర్‌‌‌‌‌‌‌‌  మాట్లాడుతూ.. అప్పులు చెల్లించాలంటూ  రైతులకు  బ్యాంకులు లీగల్‌‌‌‌‌‌‌‌  నోటీసులు జారీ చేస్తున్నాయని,  ఇది మోసం, పచ్చి దగా, నయవంచన అని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌పై ఆయన మండిపడ్డారు.  

ఆ తర్వాత రోజు  హరీష్‌‌‌‌‌‌‌‌రావు  మాట్లాడుతూ..  బ్యాంకర్లు  గ్రామాలపైకి  వచ్చి రైతులను వేధిస్తున్నారని, లీగల్‌‌‌‌‌‌‌‌ నోటీసులు పంపించి కోర్టుకీడుస్తున్నారని తెలంగాణలో బ్యాంకర్లు రజాకార్లను తలపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు తీసుకున్న రుణాల కాల పరిమితి నాలుగు నెలలే అవుతుంది.  అటువంటప్పుడు 4 నెలలకే రుణాలు తీర్చాలని బ్యాంకులు ఏవిధంగా నోటీసులు జారీ చేస్తాయి?  మీరు రుణమాఫీ చేయకపోవటంతో బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి.  బీఆర్​ఎస్సే ద్రోహం చేసిందని రైతులకు బాగా తెలుసు.

రుణమాఫీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వ్యతిరేకం

ఆగస్టు 15లోపు  ముఖ్యమంత్రి రుణమాఫీ  చేస్తే తన రాజీనామా ఆమోదించాలని అమరవీరుల  స్తూపం దగ్గర  హరీష్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లారు.  అంటే,  రైతు రుణమాఫీ చేయటాన్ని నిరసిస్తూ లేదా వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నారా?  ఎవరైనా తమ నిరసనను తెలియజేయటానికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారు.  

గతంలో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ ఇవ్వటాన్ని జాప్యం చేస్తున్నదని నిరసిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు అదేవిధంగా, రుణమాఫీ చేస్తే  హరీష్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా చేస్తున్నారా .. ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే ఆయన సంతోషంగా పదవిలో కొనసాగుతారన్నమాట. అసలు రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరగాలని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌,  బీజేపీ  కోరుకోవడం లేదు.  

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినా ఆగకుండా రాజీనామా చేయాలని సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగకూడదని, పేదలకు మేలు జరగకూడదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీల ఉద్దేశం. ఈరోజున  రైతు రుణమాఫీని అడ్డం పెట్టుకొని ఎన్నికల  గోదారిని  దాటాలని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు చేస్తున్న ప్రయత్నాన్ని  ప్రజలందరూ గమనిస్తున్నారు.  రుణమాఫీల విషయంలో రెండు పర్యాయాలు మోసం చేసిన బీఆర్​ఎస్​ను రైతులు అసలే నమ్మరు.

అబద్ధాలకు సంబురాలు

రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసి చివరకు ఎన్నికలు వస్తుండటంతో గత సంవత్సరం ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నెలన్నరలో రుణమాఫీ చేస్తామని ఇందుకోసమై రూ.19వేల కోట్లు ఇస్తామని చెప్పారు.రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించడంతో  రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహిం చాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌  పిలుపునివ్వడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు ఊరూ వాడా  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  ఫ్లెక్సీలను పెట్టి  పాలాభిషేకాలు చేసి   సంబురాలు చేశారు.

 విపక్షాలకు ఇది మాస్టర్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ అని  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పత్రికలో అట్టహాసంగా ప్రచురించారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను దేవుడి మాదిరిగా ఆకాశానికి ఎత్తేశారు.  అయితే, ఐదేండ్లు  రుణమాఫీ  చేయనందుకు ఆగ్రహించి  రైతులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అతిపెద్ద మాస్టర్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.   దీనితో 14లక్షల  మంది  రైతులకు  చెందిన  రూ.8 వేల కోట్ల  రుణమాఫీకి  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  ఎగనామం పెట్టింది.

రైతుల నెత్తిన మిత్తి

వాస్తవానికి.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నాలుగున్నరేండ్లు రుణమాఫీ ఆలస్యం చేయటంతో రూ.లక్షకు 60వేల రూపాయలు రైతుల నెత్తిన మిత్తి పడింది.  రైతు రూ.60 వేలు రుణం తీసుకుంటే  ఏటా రెన్యువల్‌‌‌‌‌‌‌‌ చేసుకోని  రైతులకు మిత్తితో కలిపి రూ.లక్షన్నర  భారం పడింది.  పంట రుణాలను  ఏడాదిలోపు చెల్లిస్తే 4శాతం వడ్డీ  పడుతుంది.  చెల్లించకపోతే  ఈ వడ్డీ 14 శాతానికి పెరిగిపోతుంది.  ప్రతి 6 నెలలకు వడ్డీని లెక్కించటంతో,   రైతులకు  రుణం తలకు మించిన భారంగా మారిపోయింది.  

ఒకవేళ  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  రూ.లక్ష  మాఫీ చేశారంటే.. దానిలో రూ.60 వేలు బ్యాంకులకు వడ్డీ కింద పోతుండగా,  రైతు చేతికి వచ్చింది కేవలం రూ.40వేలు మాత్రమే.  పేరుకు  రూ.లక్ష  రుణమాఫీ  చెప్పినప్పటికీ రైతుకు దక్కింది రూ.40వేలు మాత్రమే. ఈ రుణమాఫీ కారణంగా బ్యాంకులకు అధికంగా లబ్ధి చేకూరింది తప్ప రైతులకు దక్కింది ఎంత?  దీనికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సమాధానం చెప్పాలి.  2023 జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి తెలంగాణ రైతుల అప్పు రూ.1,12,492 కోట్లుగా ఉన్నదని  కేంద్ర ఆర్థిక శాఖ  సహాయ మంత్రి రాజ్యసభలో  చెప్పారు.  తెలంగాణ రైతులపై  తలసరి  అప్పు రూ.1,52,665గా ఉన్నట్లు ఆయన తెలిపారు.  

- అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌, టీపీసీసీ అధికార ప్రతినిధి