అతనికి చిన్నప్పటి సినిమాలంటే ఇష్టం. కానీ యాక్టింగ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మనసంతా డైరెక్షన్ మీదే ఉండేది. ఆ ఇంట్రెస్ట్‌తో స్కూల్లో ఉన్నప్పుడే స్కిట్లు రాయడం మొదలుపెట్టాడు. చదివేటప్పుడు సినిమా.. జాబ్ చేసేటప్పుడు సినిమా. అలా చదువు, డైరెక్షన్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. కాకపోతే డైరెక్టర్‌కు బదులు యాక్టర్ అయిన ఇతని పేరు నవీన్ కస్తూరియా.
తన సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ ‘‘నేను పుట్టింది.. నైజీరియాలోని ఒటుక్పో అనే ఒక చిన్న ఊళ్లో. పెరిగింది మాత్రం ఇండియాలో. నాకు ఏడాది వయసున్నప్పుడే మా ఫ్యామిలీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఢిల్లీలో బిర్లా విద్యానికేతన్ స్కూల్లో చదివా. తర్వాత నేతాజీ సుభాష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్ఐటి)లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశా. చదువు పూర్తయ్యాక 2006లో గుర్గావ్‌లోని ‘ఇండక్టిస్’ అనే అనలిటిక్స్ కంపెనీలో చేరా. అక్కడ రెండేండ్లు పనిచేశాక 2008లో ముంబైకి వెళ్లా. అక్కడ ‘జేపీ మోర్గాన్ అండ్ కో’ అనే ఒక అమెరికన్ మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పని చేశా.
మొదట్నించీ సినిమా ఇంట్రెస్ట్
స్కూల్, కాలేజీ డేస్‌లో స్కిట్స్, డ్రామాలు డైరెక్ట్ చేసేవాడిని. ఆరో తరగతి చదివేటప్పుడు మొదటిసారి ఒక స్కిట్ రాశా. ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాటకాలు మాత్రం కంటిన్యూ చేశా. నేను, నా ఫ్రెండ్స్‌తో కలిసి 2007లో థియేటర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాం. దానిపేరు ‘రైట్ క్లిక్ ఎంటర్టైన్మెంట్’. అందులో ఫస్ట్ టైం ‘ఖేల్ ఖేల్ మే’ అనే స్క్రిప్ట్ రాసి, డైరెక్ట్ చేశా. అదే మా కంపెనీలో మొదటిసారి ఆడియెన్స్‌కి టికెట్స్ అమ్మి, చూపించిన స్కిట్. అది హౌస్‌ఫుల్ అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించేవాడ్ని. అందుకని మా బంధువులంతా నన్ను ‘ఫిల్మీ ఎన్సైక్లోపీడియా’ అని సరదాగా ఆటపట్టించేవాళ్లు. సినిమా అంటే అంత ఇష్టం నాకు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా..
థియేటర్ కంపెనీ పెట్టాక కూడా నాలో సినిమా మీద ఆశ చావలేదు. డైరెక్షన్ చేయాలనే తపన నన్ను నిద్రపోనీయలేదు. దాంతో మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలని అనుకున్నా. ఆ ఛాన్స్ కోసం బాగానే తిరిగా. ‘జాష్న్’ అనే సినిమాకు 2009లో మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అయితే, కాలేజీలో ఉన్నప్పుడు ‘ఖోస్లా కా ఘోస్లా’ సినిమా చూశా. అది చూశాక డైరెక్టర్ దివాకర్ బెనర్జీకి ఫ్యాన్ అయిపోయా. అప్పటి నుంచి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాలనే కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేరింది.
కానీ, అది జరగడానికి ముందు ఒకటి జరిగింది. అదేంటంటే... డైరెక్టర్ దివాకర్ బెనర్జీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలని ఆయన దగ్గరకు వెళ్లా. ఆయన నన్ను చూసి కోక్ కమర్షియల్ యాడ్‌లో నటించమన్నారు. వెంటనే దానికి ఒప్పుకుని ఆ యాడ్‌లో నటించా. అలా మొదటిసారి టీవీ కమర్షియల్ యాడ్‌లో కనిపించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వోడాఫోన్, మహీంద్రా.. వంటి ఎన్నో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లో నటించా. అలాగని డైరెక్షన్ వదిలిపెట్టలేదు.
దివాకర్ బెనర్జీ 2010లో తీసిన ‘ఎల్ఎస్డీ’ సినిమాకి అసిస్టెంట్‌గా చేశా. ఆ తర్వాత 2012లో వచ్చిన ‘షాంఘై’ మూవీకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే చేశా. ఆస్కార్ విన్నర్ అయిన డైరెక్టర్ డానిస్ టనోవిక్ తీసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘టైగర్స్’కి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. అయితే2011లో డైరెక్టర్ అమిత్ మసుర్కర్ ఒక ఇండిపెండెంట్ సినిమాలో నటించమని అడిగారు. దాని పేరు ‘సులేమని కీడా’. అది 2014లో రిలీజ్ అయింది. అయినా కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఇండిపెండెంట్ సినిమా అయినా ఆడియెన్స్‌కి బాగా రీచ్ అయింది. ఆ మూవీతో నా కెరీర్లో ఒక మెట్టు ఎక్కా అనే చెప్పొచ్చు.
నేను చేసిన పాత్రలన్నీ అవే
నేను ఎవరినైనా కలిసినప్పుడు ముందు స్క్రిప్ట్ చదువుతా. త్వరగా కమిట్ కాను. ‘థింకిస్తాన్’ స్క్రిప్ట్ డైరెక్టర్ నెరేట్ చేశాడు. ఆ స్టోరీ, అతని ఐడియా విని నేను ఆశ్చర్యపోయా. కథ బాగా నచ్చింది. దాంతో అందులో నటించేందుకు ఒప్పుకున్నా. నిజానికి నేను నటించే పాత్రలన్నీ చాలా సామాన్య జనాలకు సంబంధించినవి. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఉండే కష్టాలు కనిపిస్తాయి. పిచర్స్లో కూడా నా క్యారెక్టర్ స్ట్రగుల్స్ పడే వ్యక్తి గురించే.
థింకిస్తాన్’లో కూడా అంతే.. ఇందులో నా క్యారెక్టర్ అమిత్. అతను ప్రజలకు స్టోరీస్ చెప్పాలనుకుంటాడు. భోపాల్ నుంచి వచ్చిన అమిత్‌కి ఇంగ్లిష్ తెలియదు. అలాంటతను అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అందులో ఎంతవరకు నెగ్గుకురాగలడో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ క్యారెక్టర్ కోసం నా లుక్, డిక్షన్ ఎలా ఉండాలనే విషయం మీద దృష్టిపెట్టా. ఇది1990ల నాటి సిరీస్. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ టైంలో చాలామంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
...నేర్చుకున్నా
నేను అసిస్టెంట్ డైరెక్టర్లా కాకుండా డైరెక్టర్‌గా ఉండడానికి ట్రై చేస్తుంటా. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి అనవసర విషయాలు చోటుచేసుకోవు. అదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటే క్లాప్ బోర్డ్ పట్టుకుని, జనాల్ని కంట్రోల్ చేస్తుండాలి. చెప్పాలంటే డైరెక్షన్ అనేది యాక్టింగ్‌కి కావాల్సిన విలువైన విషయాలు నేర్పిస్తుంది. అలాగే ఒక యాక్టర్‌గా కెమెరాని ఎలా ఫేస్ చేయాలనేది నేర్చుకున్నా. యాక్టర్ డైరెక్టర్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ కావాలి. నేను అదే చేస్తా. కాబట్టి నేను యాక్టింగ్ ఎంజాయ్ చేస్తా. నిజానికి నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. అది నేర్చుకునే అవకాశం రాలేదు. కాబట్టి సొంత ట్రిక్స్‌తో పాత్రల్ని హ్యాండిల్ చేస్తుంటా.
పెద్ద పెద్ద ఆశలు లేవు
ఎప్పుడూ పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి.. పేరున్న బ్యానర్లో నటించాలని కోరుకోను. మంచి కథల్లో నటించాలి అనుకుంటానంతే. నిజానికి డైరెక్షన్ చేయాలని వచ్చిన నేను యాక్టింగ్ వైపు మళ్లా. ప్రస్తుతం డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు.. రెండు మూడేండ్లు ఒక సినిమా కోసం కష్టపడాలి. రెండొందల మందిని కన్విన్స్ చేయాలి. అదంతా చేయాలంటే క్రియేటివిటీ ఒక్కటీ సరిపోదు. యాక్టింగ్‌కి కూడా ఆడిషన్స్ ఇవ్వాలంటే కొంచెం భయమేసేది. కానీ, ఇప్పుడు అది కూడా ఇందులో భాగమే అని అర్థం చేసుకున్నా. అలా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఇక్కడిదాకా వచ్చా” అని చెప్పాడు.
ఆస్పిరెంట్స్ స్ఫూర్తి....
ఆస్పిరెంట్స్’ అనేది ఆడియెన్స్‌కి ఎంతో కనెక్ట్ అయిన షో. టీవీఎఫ్ ఒరిజినల్ డ్రామా, ఆస్పిరెంట్ మొదటి సీజన్‌లోని స్టోరీ లైన్ ఆడియెన్స్‌ని ఆకర్షించింది. ఒక సాధారణమైన వ్యక్తి ఆశలు ఎలా ఉంటాయనేది స్క్రీన్ మీద బాగా చూపించారు. అందుకు తగ్గట్టే రెండో సీజన్ కూడా (అక్టోబర్ 25న) వచ్చింది. ఇందులో నాది అభిలాష్ శర్మ రోల్. తను అనుకున్నది సాధించడం కోసం తన ప్రేమని, ఫ్రెండ్స్‌ని వదులుకునే వ్యక్తి అభిలాష్.
టీవీఎఫ్
నేను కమర్షియల్ యాడ్స్‌లో నటించే టైంలోనే అరుణాబ్ డైరెక్ట్ చేయబోయే ఒక సినిమాకి అసిస్టెన్స్ చేసేందుకు ఆయన దగ్గరకు వెళ్లా. ఆ సినిమా అయితే సెట్స్‌కి ఎక్కలేదు. కానీ, మా ఇద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత మేం ‘రౌడీస్’ అనే స్కెచ్ చేశాం. అది ఆడియెన్స్‌కి బాగా రీచ్ కావడంతో అరుణాబ్ యూట్యూబ్ ఛానెల్ ‘టీవీఎఫ్’కి పునాది పడింది. అలా నవీన్ ‘టీవీఎఫ్’ (ది వైరల్ ఫీవర్) కోసం కొన్ని స్కెచ్‌లు చేశా. ఆ తర్వాత పిచర్స్లోకి వచ్చా. ‘సులేమాని కీడా’ బాగా ఆడింది. అయినా దాని తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నా లైఫ్‌లో పెద్ద మార్పు ఏదైనా వచ్చింది అంటే.. పిచర్స్ తర్వాతే.
- ప్రజ్ఞ