ఎవరినీ లైంగికంగా వేధించలేదు.. అవన్నీ ఫేక్: నటుడు జయసూర్య

తిరువనంతపురం: ‘నా పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ ఫేక్.. కొందరు కావాలనే నా ఇమేజ్‎ను దెబ్బతీస్తున్నరు. నేను ఎవరినీ లైంగికంగా వేధించలేదు. ఏమున్నా.. లీగల్‎గా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న. ఈ ఆరోపణలన్నీ నా ఫ్యామిలీని మానసికంగా ఎంతో బాధించాయి” అని మలయాళ నటుడు జయసూర్య అన్నారు. తాను గత నెల రోజులుగా కుటుంబంతో అమెరికాలో ఉన్నట్లు తెలిపాడు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ తన అడ్వకేట్లు చూసుకుంటున్నారని వివరించాడు. త్వరలోనే ఇండియాకు తిరిగొస్తా అని చెప్పారు. 

ఆగస్టు 31న బర్త్ డే కావడంతో విష్ చేసిన వారందరికీ ఫేస్​బుక్‎లో జయసూర్య థ్యాంక్స్ చెప్పాడు. ఈ విషయంలో తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుంది కానీ.. చివరికి నిజమే గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ సోనియా మల్హర్‎తో పాటు, మిను మునీర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నది

తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఫేక్ అని నిరూపించుకుంటానని నటుడు జయసూర్య అన్నారు. ‘‘న్యాయ పోరాటం చేస్తాను. అమెరికాలో ఉన్న పనులన్నీ ముగించుకుని వెంటనే కేరళకు బయల్దేరుతాను. మన న్యాయ వ్యవస్థపై నాకు ఎంతో నమ్మకం ఉంది’’ అని జయసూర్య అన్నారు.

వెనక్కి తగ్గేది లేదు: సోనియా మల్హార్

జయసూర్యపై తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నట్లు సోనియా మల్హార్ స్పష్టం చేశారు. ఫిర్యాదులో ప్రస్తావించిన ప్రతి అంశంలో నిజం ఉందన్నారు. అసలు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.