నార్మల్ డెలివరీల కోసం యాక్షన్ ప్లాన్

  • జగిత్యాల జిల్లా లో 70- 80 శాతం సీజేరియన్లే 
  • తగ్గించేందుకు అధికారుల కసరత్తు

జగిత్యాల, వెలుగు : రాష్ట్రంలో  జగిత్యాల జిల్లాలోనే ఎక్కువగా  సిజేరియన్ డెలివరీలు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 70 శాతం సిజేరియన్లే జరిగాయి. దీంతో వాటిని తగ్గించేదుకు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఉన్నతాధికారులు హెల్త్ డిపార్ట్​మెంట్​ సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్ల తో మాట్లాడారు. యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్పెషల్​ టీమ్​తో తనిఖీలు చేపట్టనున్నారు. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో 73.6 శాతం సీజేరియన్లే.. 

2024 లో జనవరి 24 నుంచి జూలై వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లాలోని 70 శాతం సిజేరియన్లు జరిగాయి.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,179 డెలివరీల్లో 2,140 సిజేరియన్లు ఉండగా.. 1039 నార్మల్ డెలివరీలుగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4040 డెలివరీల్లో 3216 సిజేరియన్లు, 824 నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఎంసీహెచ్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులూ ఉన్నప్పటికి సరైనసేవలు అందకపోవడం, కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రైవేట్ డాక్టర్లు రూ. 30,- 40 వేలు, సీనియర్​గా పేరున్న డాక్టర్లు అయితే రూ. 60,- 80 వేలు తీసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ముందుగానే లక్షల్లో ప్యాకేజీలు నిర్ణయించి  సిజేరియన్లు చేస్తున్నారు. 

నార్మల్ డెలివరీలను పెంచేందుకు స్పెషల్​ టీమ్​

జిల్లాలో నార్మల్​ డెలివరీలను పెంచేందుకు అధికారులు స్పెషల్​ టీమ్​ ఏర్పాటు చేస్తున్నారు.  గర్భిణులకు మూఢ నమ్మకాలు, సెంటిమెంట్లు, నొప్పుల భయం వంటి అంశాల పై అవగాహన లేకపోవడంతో సిజేరియన్లు పెరుగుతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ అపరేషన్ల తో వచ్చే అనారోగ్య సమస్యల పై వివరించకపోగా, కౌన్సెలింగ్ పేరు తో రకరకాల భయాలు కలిగిస్తున్నారని తెలుస్తోంది.

 అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. 

జిల్లా లో నార్మల్ డెలివరీలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 67.3 శాతం సి సెక్షన్లు, ప్రైవేట్ లో 73.6 శాతం గా నమోదు అవుతున్నాయి. సీ సెక్షన్ల శాతాన్ని తగ్గించాలని నిర్ణయించాం. హెల్త్ టీం లతో అన్ని ఆస్పత్రులను నిరంతర పర్యవేక్షిస్తున్నాం. గర్భిణులకు, వారి కుటుంబాలకు నార్మల్ డెలివరీలపై డాక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్ సమీయుద్దీన్, డీఎంహెచ్వో, జగిత్యాల