అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇంకెప్పుడు?

  • లకారం అలుగు వాగులో పెద్దసంఖ్యలో కట్టడాలు 
  • గతంలో 170 ఫీట్ల నాలా, ఇప్పుడు 30 ఫీట్లకు పరిమితం
  • కవిరాజ్​నగర్, చైతన్యనగర్ లో వరదలకు కారణమైన కబ్జాలు ​ 
  • రెండు వారాల్లో ఐస్ ఫ్యాక్టరీ కూల్చివేతతోనే సరి 
  • కూల్చివేతలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆక్రమణదారులు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని కవిరాజ్​ నగర్, చైతన్య నగర్ వరద ముంపునకు కారణమైన కబ్జాలు, ఆక్రమణలపై ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభం కాలేదు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇంకెప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో మున్నేరు లోతట్టు ప్రాంతాలు కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర కాలనీల్లోకి వరదలు వచ్చాయి. వరదను దారిమళ్లించేందుకు కోర్టు సమీపంలో డివైడర్​కు రెండు చోట్ల గండి పెట్టాల్సి వచ్చింది.

ఖానాపురం చెరువు అలుగు నుంచి వచ్చే నీరు లకారం చెరువుకు వెళ్లేందుకు ఉన్న వాగుపై ఆక్రమణలతోనే వరదలు వచ్చాయని స్థానికులు ఆందోళనలు చేశారు. గతంలో 170 ఫీట్లుండే నాలా కాస్తా, ఇప్పుడు 30 ఫీట్లకు కుంచించుకుపోవడం వల్లే వరద నీటి ప్రవాహం కాలనీల్లోకి మళ్లింది. దీంతో కబ్జాలు, ఆక్రమణలను కూల్చివేయాలంటూ ధర్నా కూడా చేశారు. అప్పుడు మేయర్​ నీరజ, మున్సిపల్ కమిషనర్​ అభిషేక్​ అగస్త్యతో పాటు అధికారులు వచ్చి పరిశీలించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న భవనాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు నాగార్జున ఫంక్షన్​ హాల్ పక్కనే ఉన్న ఐస్​ ఫ్యాక్టరీని మాత్రమే మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. న్యూ విజన్​ స్కూల్ బిల్డింగ్, పెద్దసంఖ్యలో అపార్ట్ మెంట్లు, పెద్ద నిర్మాణాలను వాగులోనే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నా ఇంత వరకు ఎలాంటి కూల్చివేతలు జరగలేదు. దీంతో స్థానికుల నుంచి మళ్లీ అనుమానాలు మొదలవుతున్నాయి. ఈసారి కూడా కాలయాపన చేసి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయా భవనాల యజమానులకు నోటీసులు ఇస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

లీడర్ల దగ్గరకు పరుగులు!

హైదరాబాద్​ లో హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై యాక్షన్​ తీసుకుంటారన్న ప్రచారాల నేపథ్యంలో ఆక్రమణదారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. మున్సిపల్ నోటీసులు అందుకున్న వారితో పాటు, కబ్జాలకు పాల్పడినట్టుగా ప్రచారంలో ఉన్న వారు తమ నిర్మాణాలను కాపాడుకునేందుకు అధికార పార్టీ లీడర్లను ఆశ్రయిస్తున్నారు. తమకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బతిమిలాడుతున్నారు.

అయితే ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వందలాది కుటుంబాలు వరద కారణంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో అధికార పార్టీ లీడర్లు కూడా అలాంటి ఆక్రమణదారుల విషయంలో సీరియస్​ గానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వాగును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై అధికారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారని, దానిపై తమ జోక్యం ఉండబోదని స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు స్థానికులు మాత్రం 20 ఏళ్లకు ముందు నక్షాలను, ప్రభుత్వ రికార్డులను పరిశీలించాలని కోరుతున్నారు.

వాటిని అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను, బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నేతలతో ఉన్న సంబంధాలతో తెచ్చుకున్న అక్రమ పర్మిషన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

భవిష్యత్​లో ముంపు రాకుండా చర్యలు 

భవిష్యత్​ లో ఖమ్మం నగరానికి వరద ముంపు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కార్పొరేషన్​ అధికారులు చెబుతున్నారు. లకారం అలుగువాగుపై ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేసేలా లేఖ రాశామని, సర్వే చేసి ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్​ హద్దులు నిర్ణయించిన తర్వాత పూర్తిస్థాయిలో ఆక్రమణదారులపై యాక్షన్​ ఉంటుందన్నారు. ఇప్పటికే గుర్తించిన కొందరు భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 13 మంది బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి పేపర్లు, ఓనర్ షిప్​ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. పర్మిషన్లపైనా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామన్నారు. 

కబ్జాలను తొలగించాలి

హైదరాబాద్​ లో హైడ్రా తరహాలోనే ఖమ్మంలోనూ అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటేనే, మళ్లీ వరద రాకుండా ఉంటుంది. ఆఫీసర్లు ఆలస్యం చేసేకొద్దీ రాజకీయ ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. కొన్ని వందల కుటుంబాలకు న్యాయం జరగాలంటే కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే. 
- పద్మజారెడ్డి, కవిరాజ్​ నగర్, ఖమ్మం