లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పశువైద్యాధికారి

  • గేదెల బీమా సర్టిఫికెట్‌‌‌‌ ఇచ్చేందుకు రూ. 8 వేలు డిమాండ్‌‌‌‌

  • రూ. 6 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు

దేవరకొండ (చింతపల్లి), వెలుగు : రైతుల నుంచి లంచం తీసుకుంటూ దేవరకొండ మండల పశువైద్యాధికారి పాల్‌‌‌‌ జోసఫ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ ఏసీబీకి చిక్కాడు. నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌‌‌‌ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లికి చెందిన ఇద్దరు రైతులు పీఎం ఎంప్లాయీస్‌‌‌‌ జనరేషన్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ స్కీం కింద రూ. 10 లక్షల లోన్‌‌‌‌ కోసం చింతపల్లి ఏపీజీవీబీలో అప్లై చేసుకోవడంతో లోన్‌‌‌‌ మంజూరు అయింది. అయితే గేదెలకు సంబంధించిన  ఆరోగ్య బీమాకు సంబంధించిన సర్టిఫికెట్‌‌‌‌ అందజేయాల్సి ఉంటుంది.

 దీంతో గేదెలను పరిశీలించి సర్టిఫికెట్‌‌‌‌ జారీ చేయాలని చింతపల్లి వెటర్నరీ డాక్టర్‌‌‌‌ను కలిశారు. ఆయన గేదెలను పరిశీలించి ట్యాగ్‌‌‌‌లు వేశారు. కానీ 15 రోజులు అయినా సర్టిఫికెట్‌‌‌‌ ఇవ్వకపోగా, రూ. 8 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశాడు. దీంతో రూ. 6 వేలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నప్పటికీ సర్టిఫికెట్‌‌‌‌ ఇవ్వకుండా రేపు, మాపు అంటూ జాప్యం చేశాడు. దీంతో రైతులు నల్గొండ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో సోమవారం ఉదయం చింతపల్లి వెటర్నరీ హాస్పిటల్‌‌‌‌లో వైద్యాధికారి పాల్‌‌‌‌ జోసఫ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌కు రూ. 6 వేలు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు వైద్యాధికారిని పట్టుకున్నారు. దాడిలో ఎస్సైలు వెంకట్రావు, రామారావు పాల్గొన్నారు